Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 25 Mar 2022 13:13:12 IST

కర్ణాటకలో ఏదో జరుగుతోందా?

twitter-iconwatsapp-iconfb-icon
కర్ణాటకలో ఏదో జరుగుతోందా?

- అప్పకు ప్రత్యామ్నాయంగా తెరపైకి హిందుత్వ అజెండా

- బీజేపీ వ్యూహం వెనుక సంఘ్‌ పరివార్‌?


బెంగళూరు: దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీకి అధికారం సాధించి తలుపులు తెరిచిన ఘనత మాజీ సీఎం యడియూరప్పకే దక్కుతుంది. ఇందుకోసం ఆయన దశాబ్దాలపాటు అలుపెరుగని రీతితో పలు ప్రజాపోరాటాలు చేశారు. యడియూరప్ప తన రాజకీయ జీవితంలో ఏనాడూ హిందుత్వ అజెండాను అనుసరించలేదు. ఈ కారణంగానే మైనార్టీలు సైతం ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. అన్ని వర్గాల అభిమానం చూరగొన్న నేతగా యడియూరప్ప కన్నడ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగారు. కర్ణాటకలో బీజేపీ అంటే యడియూరప్ప అనే స్థాయిలో తన చరిష్మాను నిరూపించుకున్నారు. యడియూరప్ప లేని బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా గతంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి మరీ రుజువు చేసి అధిష్టానానికి రుచి చూపించారు. యడియూరప్పకు అవినీతి మరకలు అంటినా ఏమాత్రం ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేకపోవడంతో అధిష్ఠానం పెద్దలు ఆయన నాయకత్వాన్ని ఆమోదించక తప్పలేదు. అప్పకు ప్రత్యామ్నాయం కోసం అన్వేషించడం ప్రారంభించారు. 


వయోభారం కారణం చూపి...

 లింగాయత్‌ సమాజంపై గట్టి పట్టు ఉన్న యడియూరప్పను సాగనంపడం అంత సులభంకాదని అధిష్టానం పెద్దలకు బాగా తెలిసి వచ్చింది. అందుకే వయోపరిమితిని తెరపైకి తెచ్చారు. వయోభారాన్ని కారణంగా చూపి యడియూరప్ప పదవీచ్యుతుడయ్యేలా ఆయనపై వ్యూహాత్మక ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత లింగాయత్‌ సమాజంలో వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌ బొమ్మైను తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. తమ సామాజిక వర్గమే కావడంతో యడియూరప్ప సైతం అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు. అయిష్టంగానే ఆయన రాజీపడాల్సి వచ్చింది. దశాబ్దాల కాలంగా తాను నిర్మించిన కోట కళ్ళముందే చేజారడంతో చేసేది అప్ప అంతర్మథనంలో పడ్డారు. కనీసం తన కుమారుడికైనా అవకాశం కల్పించాలని అధిష్ఠానం పెద్దలను వేడుకున్నారు. అయితే వారసత్వ రాజకీయాలకు ససేమిరా అంటున్న అధిష్టానం అప్ప వినతులపై ఇంతవరకు స్పందించలేదు. యడియూరప్ప తరుపున స్వయంగా సీఎం రంగంలోకి దిగినా ఫలితం కనిపించలేదు. ఈ పరిణామాలతో సహజంగానే అసంతృప్తితో రగలిపోతున్న యడియూరప్ప తెరవెనుక సరికొత్త రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారన్న రహస్య సమాచారం అధిష్ఠానం పెద్దలకు అందింది. దీంతో సంఘ్‌పరివార్‌ను వ్యూహాత్మకంగా రంగంలోకి దించారు. 


కలవరపెడుతున్న బొమ్మై నాయకత్వం...

బొమ్మై ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించమేరకు విజయాలను సొంతంచేసుకోలేకపోయింది. బొమ్మై నాయత్వంలో ఇదే విధంగా ముందుకు వెళితే పార్టీకి రాజకీయంగా పెద్దగా లబ్ధి చేకూరదన్న నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం ఒకే దెబ్బకు రెండు పిట్లలు చందాన అప్పకు ప్రత్నామ్నాయంగా 

పార్టీని బలోపేతం చేసేందుకు హిందుత్వ అజెండా ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చింది. బొమ్మై పగ్గాలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. తొలుత గోవధ నిషేధ చట్టాన్ని, లవ్‌జిహద్‌పై ఉక్కుపాదం మోపే చట్టాలను తీసుకొచ్చారు. ఇవి పెద్దగా లబ్ధి చేకూర్చకపోవడంతో తాజాగా హిజాబ్‌ వివాదాన్ని రగిలించారు. దశాబ్దాల కాలంగా కర్ణాటకలో హిజాబ్‌ కొనసాగుతూ రాగా కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా విద్యార్ధుల పోషకుల స్థానంలో ఎమ్మెల్యేలకు పగ్గాలు అప్పగించారు. ఇక్కడి నుంచే వివాదం కొత్తమలుపు తిరిగింది. ఉడుపి పీయూ కళాశాల సీడీసీ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే రఘుపతి భట్‌ హిజాబ్‌ను నిషేధిస్తూ ఉత్వర్వులు జారీ చేయడం ఇది రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల పాటు పెనువివాదంగా మారడం, హింసాత్మకం కావడం తెలిసిందే.  

ఈ క్రమంలో తాజాగా హిందు ఆలయాల జాతరల్లో ముస్లిం వ్యాపారులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో హిందూ-ముస్లిం మధ్య అడ్డుగోడలు నిర్మాణమయ్యే వాతావరణం ఏర్పడింది. కన్నడ నాట దశాబ్దాలుగా ముస్లిం దర్గాల ఉరుసు ఉత్సవాలు, మొహర్రం ఉత్సవాల్లో హిందువులు, హిందూ దేవుళ్ళ జాతరల్లో ముస్లింలు కల్సికట్టుగా వ్యాపారాలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. తీరా ఇప్పుడు ఉభయమతాల మధ్య సామరస్యం దెబ్బతిని శాంతికి విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. 

  శివమొగ్గలో భజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష దారుణ హత్య, హిజాబ్‌ నిషేధంపై ముస్లింలు చట్టాలను సైతం సవాల్‌ చేసేలా వ్యవహరించడం వంటి పరిణామాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో ఏడాదిలోగా శాసనసభ ఎన్నికలు జరుగునున్న తరుణంలో వరుస పరిణామాలు చోటుచేసుకోవడం వెనుక బీజేపీ పక్కా వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ అగ్రనేత యడియూరప్పకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రలో హిందూ ఓట్లు సంఘటితమయ్యలా బలంగా పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు మదింపు వేస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.