రాష్ట్రమంతటా హిజాబ్‌ నిరసనలు

ABN , First Publish Date - 2022-02-19T17:24:31+05:30 IST

రాష్ట్రమంతటా హిజాబ్‌పై నిరసనలు కొనసాగాయి. హైకోర్టు ధర్మాసనం హిజాబ్‌పై సమగ్ర విచారణలు కొనసాగిస్తుండగా మరోవైపు ఆందోళనలు నిరంతరమయ్యాయి. శుక్రవారం తుమకూరు, చిత్రదుర్గ, బెళగావి,

రాష్ట్రమంతటా హిజాబ్‌ నిరసనలు

                     - హైకోర్టులో విచారణ 21కి వాయిదా 


బెంగళూరు: రాష్ట్రమంతటా హిజాబ్‌పై నిరసనలు కొనసాగాయి. హైకోర్టు ధర్మాసనం హిజాబ్‌పై సమగ్ర విచారణలు కొనసాగిస్తుండగా మరోవైపు ఆందోళనలు నిరంతరమయ్యాయి. శుక్రవారం తుమకూరు, చిత్రదుర్గ, బెళగావి, యాదగిరి, విజయపుర, చిక్కమగళూరు, బళ్లారితోపాటు పలు జిల్లాల్లో హిజాబ్‌లతోనే విద్యార్థినులు పాఠశాలలకు హాజరయ్యేందుకు వచ్చారు. అధ్యాపకులు వారిని కట్టడి చేయాల్సిన పరిస్థితి కొనసాగింది. దీంతో పాఠశాలల ప్రాంగణంలో 144వ సెక్షన్‌ను పలు జిల్లాలు అమలు చేశాయి. హిజాబ్‌ మాహక్కు అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన కొనసాగించారు. చిత్రదుర్గ , విజయపురతోపాటు పలు చోట్ల విద్యార్థులకు ప్రత్యేకంగా హైకోర్టు నిబంధనలు పా టించాల్సి ఉందని వివరించినా ఫలితం లేకపోయింది. రాష్ట్రమంతటా ఆందోళనలు కొనసాగాయి. కాగా హైకోర్టులో ఐదో రోజు నిరంతరంగా విచారణలు కొనసాగాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ ప్రభులింగ నావదగి వాదనలు వినిపించారు. ఉడుపిలో కేవలం ఆరుగురు విద్యార్థులు నెలరోజులపాటు ఆందోళన చేశారని అక్కడ మాత్రమే ఎందుకు సమస్య తలెత్తిందని, సదరు కళాశాలలో అంతకుముందు ఎన్నడూలేని హిజాబ్‌ ఎందుకు ప్రవేశించిందో అనే సాక్ష్యాలను ధర్మాసనం ముందు వివరించారు. సాయంత్రం దాకా విచారణలు సాగగా సోమవారానికి వాయిదా వేశారు. కాగా మతం పేరిట విద్యార్థుల భవిష్యత్తును తల్లిదండ్రులు నష్టం కలిగించరాదనే వాదనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 


హిజాబ్‌ గొడవ కారకులను అరెస్టు చేయండి: కేంద్ర మంత్రి 

హిజాబ్‌ వేయించేందుకు, తొలగించేందుకు ఎవరు కళాశాలల వద్దకు వస్తారో వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. హుబ్బళ్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నింటినీ సహించుకుని మౌనంగా ఉండడం సాధ్యం కాదన్నారు. విద్యార్థులను కళాశాలలకు చేర్చుకోవాలని, అనవసరంగా వారిని రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలను అందరూ పాటించాలన్నారు. ఇదే తరహాలో వదిలితే అంతిమతీర్పును పాటించరన్నారు. కఠినచర్యలకు ప్రభుత్వం సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్‌కు ఆందోళన చేయడమే విధిగా మారిందని, భవిష్యత్తులోనూ వారు అలాగే కొనసాగించాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2022-02-19T17:24:31+05:30 IST