Karnatakaలో వేడెక్కిన రాజకీయం

ABN , First Publish Date - 2022-05-14T17:44:08+05:30 IST

రాజ్యసభ, విదానపరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌తో రాష్ట్రంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. శాసనసభకు మరో ఏడాదిలో సా ధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వీటిని అన్ని

Karnatakaలో వేడెక్కిన రాజకీయం

- నాలుగు రాజ్యసభ, 11 విధానపరిషత్‌ స్థానాలకు ఎన్నికలు

- మరోసారి ఇక్కడి నుంచే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

-  కేసీ రామమూర్తికి మళ్లీ అవకాశం 

- కాంగ్రెస్‌ అభ్యర్థిగా జైరాం రమేశ్‌

- నాలుగో స్థానానికి జేడీఎస్‌ నిర్ణయమే కీలకం


బెంగళూరు: రాజ్యసభ, విదానపరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌తో రాష్ట్రంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. శాసనసభకు మరో ఏడాదిలో సా ధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వీటిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నాలుగు రాజ్యసభ స్థానాలతోపాటు 11 విధానపరిషత్‌ స్థానాలకు ఎన్నికల పర్వం మొదలైంది. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. జూన్‌ 10న ఓటింగ్‌ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రాష్ట్ర శాసనసభ్యుల కోటా ప్రకారం బీజేపీ రెండు, కాంగ్రెస్‌ ఒక స్థానంలో సునాయాసంగా గెలుస్తాయి. మరో స్థానంలో బీజేపీ, జేడీఎ్‌స కలిస్తే గెలుపు సాధ్యమవుతుంది. కర్ణాటక కోటాలో రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరోసారి ఇక్కడి నుంచే కొనసాగించేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యుడు కేసీ రామమూర్తికి మరోసారి అవకాశం కల్పించేందుకు బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. వీరిద్దరి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జైరాం రమేశ్‌కు అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ వేదికగానే ఈ అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు చెందిన సీనియర్‌ నేత ఆస్కర్‌ఫెర్నాండెజ్‌తో ఖాళీ అయిన మరోస్థానం భర్తీ చేసుకునేందుకు రెండు కీలక పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలో ఒంటరిగా బరిలో దిగే అవకాశం లేదు. జేడీఎప్‌ బీజేపీకి సహకరిస్తే గెలుపొందే అవకాశం ఉంది. కాగా నేటితో ఎమ్మెల్యేల కోటా నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పదవులు కోల్పోయేవారిలో లక్ష్మణ సవది, రామప్పతిమ్మాపుర, అల్లంవీరభద్రప్ప, హెచ్‌ఎం రమేష్ గౌడ, వీణా అచ్చయ్య, కేవీ నారాయణస్వామి, లెహర్‌సింగ్‌సిరోయ ఉన్నారు. వీరి స్థానంలో ఏడుగురు ఎమ్మెల్సీలను భర్తీ చేసేందుకు జూన్‌ 3న ఎన్నిక జరగనుంది. రెండు టీచర్‌, రెండు పట్టభధ్రుల ఎమ్మెల్సీల గడువు జూలై 4తో ముగియనుంది. దీంతో జూన్‌ 13న ఓటింగ్‌ జరిగేలా ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. పశ్చిమ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాల నుంచి ప్రస్తుత విధానపరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టి, వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గానికి అరుణ్‌ శెహపుర, వాయువ్య పట్టభద్రుల నియోజకవర్గం నుంచి హనుమంత నిరాణి, దక్షిణ పట్టభద్రుల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ శ్రీకంఠేగౌడ పదవీకాలం ముగియనుంది. ఎంతోకాలంగా జేడీఎస్ లో కొనసాగిన బసవరాజహొరట్టి బీజేపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. జేడీఎస్ లో పోటీ చేస్తే ఓటమి తప్పదనే ఆయన పార్టీ మారారు. ఇప్పటికే ఏడుసార్లు ఎమ్మెల్సీగా 42 ఏళ్ళపాటు ఎమ్మెల్సీగా కొనసాగిన హొరట్టి జనతా పరివార్‌ను కాదనుకుని బీజేపీ ద్వారా పోటీ చేయదలచారు. ఆయన పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కానున్నారు. కాంగ్రెస్‌ నుంచి బసవరాజ్‌ గురికార పేరు ఖరారైంది. వా యువ్య పట్టబద్రుల నియోజక వర్గం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హనుమంత నిరాణికి మరోసారి టికెట్‌ ఖరారు చేశారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీల్‌ సంక పోటీ చేయనున్నారు. వాయువ్య ఉపాధ్యాయ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి ప్రకాశ్‌ హుక్కేరి పేరు ఖరారు కాగా బీజేపీ నుంచి అరుణ్‌ శెహపుర పోటీ చేయనున్నారు. ఇలా 11 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మినీ సంగ్రామాన్ని తలపిస్తోంది. అధికార బీ జేపీ అభ్యర్థులను ఖరారు చేసే విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఇటీవల ఢిల్లీ పర్యటనలో చర్చలు జరిపినట్లు సమాచారం. రెండు టీచర్‌, రెండు పట్టభద్రుల స్థానాలకు వివిధ జిల్లాల పరిధిలో ప్రచారాలు, ఓటింగ్‌ వంటి ప్రక్రియలు ఉన్నా 7 ఎమ్మెల్సీ, నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మాత్రం విధానసౌద చుట్టూనే తిరగనుంది.

Read more