మంత్రులందరితో రాజీనామా చేయించే యోచన..?

ABN , First Publish Date - 2022-04-10T17:44:59+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు ఢిల్లీ స్థాయిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అత్యంత రహస్యంగా ఆలకిస్తున్నట్టు

మంత్రులందరితో రాజీనామా చేయించే యోచన..?

Karnatakaలో భారీ ప్రక్షాళన

- రాష్ట్రంలోనూ కామరాజ్‌ సూత్రం 

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం 


బెంగళూరు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు ఢిల్లీ స్థాయిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అత్యంత రహస్యంగా ఆలకిస్తున్నట్టు సమాచారం. కేబినెట్‌లో చాలామంది మంత్రుల పనితీరుతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న సంగతి బహిర్గతమైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో బొమ్మై కేబినెట్‌లో కొద్దిపాటి మార్పులకు బదులు భారీ ప్రక్షాళన చేపట్టేదిశలో అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మంత్రులందరితో రాజీనామాలు చేయించిన తరహాలోనే కర్ణాటకలోనూ కామరాజ్‌ సూత్రాన్ని అమలు చేసేందుకు కసరత్తు సాగుతున్నట్టు తెలిసింది. మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలికి, మరికొందరికి అవకాశం కల్పిస్తే అది 2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని భావిస్తున్న అధిష్టానం పెద్దలు ఈ తాజా సూత్రాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. గందరగోళానికి తావులేని విధంగా ప్రక్షాళన కసరత్తు సాఫీగా సాగిపోయేలా ఈ మొత్తం వ్యవహారాన్ని అధిష్టానం కనుసన్నల్లోనే పూర్తి చేయనున్నారు. సీనియర్‌ మంత్రులకు ఉద్వాసన పలికి వారికి జిల్లా ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టు వినిపిస్తోంది. 


ఉపముఖ్యమంత్రులపై తేలని స్పష్టత 

ఎన్నికలవేళ ఉపముఖ్యమంత్రి స్థానాలపై అధిష్టానం పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎన్నికలవేళ ఇలాంటి ప్రయోగాలు మంచివి కావని, కొత్తగా అధికార కేంద్రాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఉపముఖ్యమంత్రి పదవులను తెరపైకి తెచ్చేందుకు ఎలాంటి కథనాలు ప్రస్తుతానికి ప్రచారంలో లేవు. అధిష్టానం సారథ్యంలోనే ముఖ్యమం త్రి బొమ్మై కేబినెట్‌ ఏర్పాటు జరిగితే ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఉపముఖ్యమంత్రి పదవుల వల్ల కొత్త సమస్యలే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పార్టీ సీనియర్‌ నేతలు సైతం భావిస్తున్నట్టు తెలిసింది. 


కామరాజ్‌ సూత్రం ఏమిటంటే...?

ముఖ్యమంత్రి మినహా మంత్రులందరితోనూ రాజీనామా చేయించి కొత్త గా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడమే కామరాజ్‌ సూత్రం. గతం లో ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు అప్పటి కాం గ్రెస్‌ నేత తమిళనాడుకు చెందిన కామరాజ్‌ ఈ సూత్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇది అప్పట్లో విజయం సాధించడంతో కామరాజ్‌ సూత్రంగానే స్థిరపడింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో ఈ సూత్రాన్ని అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 


పాత, కొత్తల కలయిక 

రాష్ట్రమంత్రిమండలిలో అపార అనుభవం కల్గిన సీనియర్లతోపాటు కొత్తగా యువనేతలకు అవకాశం కల్పించేలా కూర్పు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16, 17 తేదీలలో విజయనగర జిల్లా హొస్పేటలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరమే ప్రక్షాళనకు తుది మెరుగులు దిద్దే సంకేతాలు కనిపిస్తున్నాయి. మంత్రులందరి రాజీనామాలను పొందినప్పటికీ వీరిలో పది మందికి ఉద్వాసన పలకడం ద్వారా ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలతో కలిపి మొత్తం 14 స్థానాల భర్తీ చేయవచ్చునన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Updated Date - 2022-04-10T17:44:59+05:30 IST