రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-07-06T17:28:23+05:30 IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావానికి పలు రిజర్వాయర్లు జలకళను

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు

- రిజర్వాయర్లకు జలకళ

- చిక్కమగళూరు జిల్లాలో నీట మునిగి ఇద్దరి మృతి 


బెంగళూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావానికి పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణరాజసాగర్‌లో నీటిమట్టం 111.64 అడుగులకు చేరుకోగా హారంగి రిజర్వాయర్‌ 2,855 అడుగులకు చేరుకుంది. కబిని రిజర్వాయర్‌ 2,269 అడుగులకు, లింగనమక్కి రిజర్వాయర్‌ 1759 అడుగులకు, సూపా రిజర్వాయర్‌ 518 మీటర్లకు, మాని రిజర్వాయర్‌ 571 అడుగులకు, తుంగభద్ర రిజర్వాయర్‌లో నీటిమట్టం 1,614 అడుగులకు, మలప్రభ రిజర్వాయర్‌లో నీటిమట్టం 2,053 అడుగులకు చేరుకుంది. ఇక ఘటప్రభలో నీటిమట్టం 2,091 అడుగులకు, భద్రలో 155 అడుగులకు చేరుకుంది. ఆల్మట్టి రిజర్వాయర్‌లో గరిష్ట నీటిప్రమాణం 519 మీటర్లు కాగా ప్రస్తుతం 513 మీటర్లకు నీటిమట్టం చేరుకోవడం విశేషం. నారాయణపురలో నీటిమట్టం 491 మీటర్లకు చేరుకుందని జలవనరులశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. కోస్తాతీరం అంతటా రెండుమూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మడికేరి జిల్లాలో వర్షపాతం తీ వ్రంగా ఉంది. భాగమంగల ప్రదేశంలో భారీ వర్షాలతో సంచారానికి అంతరాయం ఏర్పడింది. దక్షిణకన్నడ, చిక్కమగళూరు, ఉత్తరకన్నడ జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. చిక్కమగళూరు తాలూకా తొగరిహనకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఏడేళ్ల బాలిక కాలుజారి వర్షపునీటి గుంతలో పడి మృతిచెందింది. కుందాపుర తాలూకాలోని హల్లూరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న లక్ష్మి వర్షపునీటిలో కొట్టుకుపోయి మృతిచెందింది. భారీ వర్షంతో అట్టుడికిపోతున్న కోస్తా జిల్లాల్లో తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశాలను ఆదేశించారు. 

Updated Date - 2022-07-06T17:28:23+05:30 IST