కర్ణాటక ప్రమాదం.. దిగ్భ్రాంతిలో భాగ్యనగరం.. మృతులంతా ఇక్కడి వారే..

ABN , First Publish Date - 2022-06-04T17:41:12+05:30 IST

సరదాగా సాగిపోతున్న విహారయాత్రలు ఒక్కోసారి విషాదంతో ముగుస్తున్నాయి. యాత్రకు వెళ్లిన వారు ఉత్సాహంగా

కర్ణాటక ప్రమాదం.. దిగ్భ్రాంతిలో భాగ్యనగరం.. మృతులంతా ఇక్కడి వారే..

  • శోకసంద్రంలో కుటుంబసభ్యులు


హైదరాబాద్ సిటీ/తిరుమలగిరి/మారేడుపల్లి/పేట్‌బషీరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌: సరదాగా సాగిపోతున్న విహారయాత్రలు ఒక్కోసారి విషాదంతో ముగుస్తున్నాయి. యాత్రకు వెళ్లిన వారు ఉత్సాహంగా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు. కర్ణాటకలో (Karnataka) జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు సజీవదహనంతో నగరం దిగ్ర్భాంత్రికి గురైంది.


ట్రావెల్స్‌ మేనేజర్లు శివకుమార్‌, హెప్సిబా తెలిపిన వివరాల ప్రకారం.. మే నెల 28న విహారయాత్రకు గోవా వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రిసాలబజార్‌ బంజారా నగర్‌కు చెందిన అర్జున్‌కుమార్‌ తనతో పాటు 26 మంది కుటుంబసభ్యులు, స్నేహితులకు టికెట్లు బుక్‌ చేశాడు. 28న సుచిత్రాలోని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో గోవా బయలుదేరారు. విహార యాత్రను ముగించుకొని జూన్‌ 2న నగరానికి తిరిగి వస్తుండగా కర్ణాటకలోని కాలబురిగీలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ సహా మొత్తం 35 మంది ఉన్నారు. వీరిలో 26 మంది అర్జున్‌ కుమార్‌ టికెట్లు తీసిన వారు కాగా, నలుగురు రామాయణపేట్‌కు చెందిన వారు, ఇద్దరు ఇతర ప్రాంతాల వారు. కాగా, అర్జున్‌ కుమార్‌ (36), సరళ (34), అనిత (58), రవళి (32), శివ (38), వివాన్‌ (3), దీక్షిత్‌ (9) ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబాలను బస్సు యాజమాన్యం ఆదుకుంటుందని మేనేజర్లు తెలిపారు.


కొడుకుని ఒడిలో కూర్చోబెట్టుకునే..

కరీంనగర్‌లో కుమార్తె ఇంట్లో ఉన్నాను. మనవడు బస్సు ప్రమాదంలో (Bus Accident) చనిపోయాడని బంధువులు చెప్పడంతో హుటాహుటిన నగరానికి వచ్చాను. బస్సు ప్రమాదంలో రవళి తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని కాలిపోయింది. ఆ ఫొటోలు చూస్తే గుండె తరుక్కుపోయింది. శివకుమార్‌, భార్య, కొడుకు కాలి బూడిదయ్యారు. - ఎల్లమ్మ, శివ కుమార్‌ అమ్మమ్మ


బాగా ఎంజాయ్‌ చేశామన్నాడు.. అంతలోనే..

బస్సు ప్రమాదంలో అన్నయ్య, వదిన, అల్లుడు దీక్షిత్‌ చనిపోయారని టీవీల్లో చూశాను. రెండు రోజుల క్రితం అన్నయ్య నాతో ఫోన్‌లో మాట్లాడాడు. గోవాలో చాలా బాగా ఎంజాయ్‌ చేశామని చెప్పాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉంటామన్నాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఒకేసారి కుటుంబంలో ముగ్గురు చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్నా. - సంధ్య, బాధిత కుటుంబసభ్యురాలు


నిమిషాల్లో బస్సు కాలిపోయింది..

చిన్న గాయాలతో బయట పడ్డాం. మేం ఐదుగురు స్నేహితులం కలిసి గోవాకు వెళ్లాం. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులోంచి కష్టంగా కొంతమంది బయటపడ్డాం. అప్పటికే పొగలు రావడంతో బస్సుకు దూరంగా వెళ్లాం. నిమిషాల్లో బస్సు కాలిపోయింది. - గగన్‌దీప్, ప్రయాణికుడు


దిగ్ర్భాంతికి గురయ్యా..

ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తీవ్ర దిగ్భాంతికి గురయ్యా. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి. - వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌  నేత, రిసాల్‌బజార్‌


మృతదేహాల కోసం వెళ్లారు

ముగ్గురు మృతదేహాలను తీసుకురావడానికి కర్ణాటకకు శివకుమార్‌ తల్లిదండ్రులు వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కామాటిపురాకు చేరుకుంటారు. మృతదేహాలు ఆనవాళ్లు లేకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షల తర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నారు. - శ్రీనివాస్‌ గౌడ్‌, శివ కుమార్‌ బంధువు. 


మంచి స్నేహితుడిని కోల్పోయాను..

కామాటిపురా బస్తీలో శివకుమార్‌ ప్రతి ఒక్కరితో అన్యోన్యంగా ఉండేవాడు. అందరినీ అన్న అని పలకరించేవాడు. 29న రవళి బంధువులతో కలిసి గోవా యాత్రకు వెళ్తున్నామని చెప్పాడు. మంచి స్నేహితున్ని కోల్పోయాను. శివ కుమార్‌ కుటుంబంలో ముగ్గురు చనిపోవడం, చిన్న కుమారుడు ఆద్విత్‌ (3) అనాథ కావడం కంటతడి పెట్టిస్తోంది. - సురేశ్‌ ముదిరాజ్‌, స్నేహితుడు.









Updated Date - 2022-06-04T17:41:12+05:30 IST