కర్ణాటక ప్రొఫెసర్లకు పట్టం?

ABN , First Publish Date - 2020-08-10T09:58:47+05:30 IST

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటైన రెండు సెంట్రల్‌ యూనివర్సిటీలకు తొలి వైస్‌చాన్సెలర్లుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్లను

కర్ణాటక ప్రొఫెసర్లకు పట్టం?

  • 2 కేంద్ర వర్సిటీలకు వీసీలుగా రంగం సిద్ధం
  • అనంతపురం(సెంట్రల్‌ వర్సిటీ)కి ఎస్‌ఏ కోరి!
  • విజయనగరం(గిరిజన వర్సిటీ)కి టీవీ కట్టమణి!
  • కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. త్వరలో రాష్ట్రపతికి సిఫారసు
  • రెండూ విభజన చట్టంలో భాగంగా ఏర్పాటైనవే
  • తొలి వీసీలుగా రాష్ర్టేతరుల ఎంపికపై విస్మయం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటైన రెండు సెంట్రల్‌ యూనివర్సిటీలకు తొలి వైస్‌చాన్సెలర్లుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్లను నియమించేందుకు రంగం సిద్ధమైంది. అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ ఎస్‌ఏ కోరి, విజయనగరంలోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసీగా ప్రొఫెసర్‌ టీవీ కట్టమణి పేర్లను త్వరలోనే రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం వెనుక కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర విద్యాశాఖలో పనిచేస్తోన్న మరో వ్యక్తి సిఫారసులు ఉన్నట్లు సమాచారం. కోరి కర్ణాటక ఉన్నత విద్య కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కాగా, కట్టమణి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో పనిచేసి రిటైరయ్యారు. వీరిద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కేంద్రం ఈ రెండు సెంట్రల్‌ వర్సిటీలను మాత్రమే మంజూరు చేసింది. కనీసం ఒక వీసీ పోస్టుకు అయినా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నియమిస్తే కొంతవరకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


రెండు సెంట్రల్‌ వర్సిటీలకు ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులను నియమించడం పట్ల రాష్ట్ర విద్యావేత్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మన రాష్ట్రంలో ఏర్పాటైన వర్సిటీలను శీఘ్రగతిన అభివృద్ధి చేసేందుకు ఇతరులకు ఆసక్తి ఏం ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం సెంట్రల్‌ వర్సిటీకి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మెంటర్‌ వర్సిటీగా వ్యవహరిస్తోంది. విజయనగరం గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం విశాఖలోని ఆంధ్రా వర్సిటీ మెంటర్‌ వర్సిటీగా వ్యవహరిస్తోంది. వీటికి వీసీల నియామకానికి  కేంద్ర విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. అందిన దరఖాస్తులను స్ర్కీనింగ్‌ చేసిన అనంతరం 16 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరిలో ఒక్కో వర్సిటీకి ఐదుగురి చొప్పున 10 మంది జాబితాను నిపుణుల కమిటీకి పంపించారు. అందులో ఒక్కో వర్సిటీకి ముగ్గురేసి పేర్లను ఎంపిక చేసి నిపుణుల కమిటీలు కేంద్ర విద్యాశాఖకు పంపించాయి. 

Updated Date - 2020-08-10T09:58:47+05:30 IST