కర్ణాటక మంత్రుల రహస్య భేటీ కేవలం వదంతులే : మంత్రి రవి

ABN , First Publish Date - 2020-07-05T00:55:55+05:30 IST

కర్ణాటకలో ఇద్దరు మంత్రులు రహస్యంగా సమావేశమయ్యారని ఇటీవల

కర్ణాటక మంత్రుల రహస్య భేటీ కేవలం వదంతులే : మంత్రి రవి

బెంగళూరు : కర్ణాటకలో ఇద్దరు మంత్రులు రహస్యంగా సమావేశమయ్యారని ఇటీవల బాగా ప్రచారమవుతోంది. రెవిన్యూ మంత్రి ఆర్ అశోక, పరిశ్రమల మంత్రి జగదీశ్ షెట్టార్ చికమగళూరులో రహస్యంగా భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మంత్రులిద్దరూ అసలు కలుసుకోనేలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, చికమగళూరు ఇన్‌ఛార్జి మంత్రి సీటీ రవి స్పష్టం చేశారు. 


అశోక, షెట్టార్ బుధవారం చికమగళూరు జిల్లాలోనే ఉన్నారని, అయితే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాత్రమే వీరు వచ్చారని రవి తెలిపారు. వీరిద్దరూ ఒకరినొకరు కలవలేదని చెప్పారు. 


అశోక పుట్టిన రోజు బుధవారం జరిగిందని, ఆయన మంగళవారం రాత్రి చికమగళూరు వచ్చారని తెలిపారు. పండరవల్లిలోని ఓ రిసార్ట్‌లో బస చేశారని చెప్పారు. బుధవారం ఆయన సగనిపుర రోడ్డులోని ఓ ప్రాంతంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. ఆ రోజు రాత్రి అదే రిసార్ట్‌లో బస చేసి, మర్నాడు గురువారం తిరిగి బెంగళూరు వెళ్ళిపోయారన్నారు. 


షెట్టార్ బుధవారం శివమొగ్గ నుంచి చికమగళూరు వచ్చారన్నారు. ఆ రాత్రి వేరొక రిసార్ట్‌లో బస చేసి, గురువారం అంబ్లే ఇండస్ట్రియల్ ఏరియాను సందర్శించి, జిల్లా పరిషత్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారని చెప్పారు. 


ఈ మూడు రోజులూ సీటీ రవి కూడా చికమగళూరులోనే ఉండటంతో వీరంతా రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని మంత్రివర్గంలో కొందరు మంత్రులు తమకు ప్రాధాన్యం లభించడం లేదని అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ పుకార్లేనని సీటీ రవి చెప్తున్నారు. 


Updated Date - 2020-07-05T00:55:55+05:30 IST