కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-21T05:53:47+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటక మద్యం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు, కార్లను చూపుతున్న పోలీసులు

 నలుగురు నిందితుల అరెస్టు

చిత్తూరు, ఏప్రిల్‌ 20: నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  వారి వద్ద నుంచి రూ. 5.04 లక్షల విలువ చేసే మద్యం, రూ.40 లక్షల  విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి మంగళవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.   మంగళవారం ఉదయం చిత్తూరు నగరం తేనబండ  రాజీవ్‌నగర్‌లోని జటాలమ్మ ఆలయానికి సమీపంలో కర్ణాటక మద్యాన్ని అట్ట పెట్టెల  నుంచి దించుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండో పట్టణ సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ మల్లికార్జున, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మూడు కార్ల నుంచి కర్ణాటక మద్యాన్ని దించుతున్న తేనబండకు చెందిన ఎన్‌. జ్యోతీశ్వరన్‌, కురబలకోట మండలం కొత్తకురువపల్లెకు చెందిన చామంచి మల్లికార్జున, కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా సింగన్‌హల్లికి చెందిన వి.మోహన్‌, ఐరాల మండలం నాంపల్లెకు చెందిన కె. ప్రదీప్‌ అలియాస్‌ బక్కోడును పోలీసులు పట్టుకున్నారు. జగదీష్‌, హమీద్‌ పారిపోయారు. వారి నుంచి 46 కేసుల అమృత్‌ సిల్వర్‌(180 ఎం.ఎల్‌) బ్రాందీ, 24 కేసుల అమృత్‌ సిల్వర్‌(90 ఎం.ఎల్‌) బ్రాందీ  బాటిళ్ళతో కలిపి 70 బాక్సుల్లో ఉన్న రూ. 5.04 లక్షల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే  మద్యాన్ని తరలించడానికి ఉపయోగించిన రూ. 40 లక్షల విలువ చేసే మూడు కార్లను సీజ్‌ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యాన్ని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీఐ యుగంధర్‌, ఎస్‌ఐ మల్లికార్జునలతో పాటు సిబ్బందికి ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి నగదు బహుమతి అందించి అభినందించారు.  సమావేశంలో నగర డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-04-21T05:53:47+05:30 IST