Har Ghar Tiranga: ‘జాతీయ జెండాల అమ్మకాలు తగ్గిపోయాయి’

ABN , First Publish Date - 2022-08-13T16:48:40+05:30 IST

స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా

Har Ghar Tiranga: ‘జాతీయ జెండాల అమ్మకాలు తగ్గిపోయాయి’

బెంగళూరు : స్వతంత్ర భారత దేశ వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం (Har Ghar Tiranga)ను ఎగురవేస్తున్న సమయంలో కర్ణాటక ఖాదీ, గ్రామోద్యోగ సంయుక్త సంఘం (Karnataka Khadi Gramodyoga Samyukta Sangham) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మన దేశంలో అన్ని పరిమాణాలలోని జాతీయ జెండాలను తయారు చేయడానికి అధికారికంగా అనుమతిగల ఏకైక సంస్థ ఇది. జాతీయ జెండాల తయారీ నిబంధనలను ప్రభుత్వం సవరించడంతో తమ వద్ద కొనేవారు తగ్గిపోయారని చెప్తోంది. 


కర్ణాటకలోని బెంగేరీ (Bengeri)లో ఉన్న ఖాదీ పరిశ్రమల్లో పని చేసే మహిళలు అత్యంత ప్రేమ, భావోద్వేగంతో జాతీయ జెండా (Indian National Flag)లను తయారు చేస్తారు. జాతీయ జెండాలను తయారు చేయడం గర్వకారణంగా భావిస్తారు. అధికారుల కార్లపైనా, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైనా పెట్టేందుకు, అమర జవాన్ల పార్దివదేహాలపై కప్పేందుకు రకరకాల పరిమాణాలలో వీరు వీటిని తయారు చేస్తారు. 


1957 నుంచి... 

జాతీయ జెండాల తయారీకి బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న ఏకైక సంఘం కర్ణాటకలోని హుబ్బళి, బెంగేరీ గ్రామంలో ఉన్న కర్ణాటక ఖాదీ, గ్రామోద్యోగ సంయుక్త సంఘం. 1957 నుంచి ఇక్కడ జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమాన్ని చేపట్టడంతో ఇక్కడ పని చేసే మహిళలకు చేతి నిండా పని దొరుకుతుందని ఆశించారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల చేసిన సవరణల వల్ల వీరికి నిరాశ ఎదురైంది. 


కొత్త నిబంధనలతో ఇబ్బందులు

గతంలో అమలైన నిబంధనల ప్రకారం, జాతీయ జెండాలను తయారు చేయడానికి పాలిస్టర్‌ను ఉపయోగించకూడదు. యంత్రాలతో తయారు చేయకూడదు. కానీ మోదీ ప్రభుత్వం 2021 డిసెంబరులో ఈ నిబంధనలను సవరించింది. ఖాదీ, కాటన్, సిల్క్, వుడెన్ మెటీరియల్‌తో జాతీయ జెండాలను తయారు చేసేందుకు అవకాశం కల్పించింది. చేతితో నేసిన వస్త్రంతో కూడా తయారు చేయవచ్చునని తెలిపింది. 


తగ్గిన ఆర్డర్లు 

ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమం వల్ల తమకు దాదాపు రూ.10 కోట్ల విలువైన ఆర్డర్లు వస్తాయని ఈ సంఘం ఆశించింది. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.2 కోట్ల విలువైన ఆర్డర్లు మాత్రమే వచ్చాయని తీవ్ర నిరాశతో ఈ సంఘం నేతలు చెప్తున్నారు. ఈ సంఘంలో దాదాపు 1,300 మంది పని చేస్తున్నారు. బెంగేరీ ఖాదీ మేకింగ్ యూనిట్‌లో 600 మంది పని చేస్తున్నారు, వీరిలో 90 శాతం మంది మహిళలే. వీరంతా రోజువారీ వేతనాలపై పని చేస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు సంపాదిస్తారు. 


మా హృదయాలు గాయపడ్డాయి

ఓ ఉద్యోగిని మాట్లాడుతూ, తాము తయారు చేసిన ఖాదీ జెండాలు ప్రతి ఇంటిపైనా ఎగురుతాయని తాము ఎంతో సంతోషించామని, అయితే జాతీయ జెండాల అమ్మకాలు తగ్గిపోవడంతో తమ హృదయాలు గాయపడ్డాయని చెప్పారు. పాలిస్టర్‌ను ఉపయోగించి జెండాలను తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతించిందని, ఖాదీ మన దేశానికి గర్వకారణమని చెప్పారు. మన దేశంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఖాదీని ఉపయోగించనక్కర్లేదా? అని ప్రశ్నించారు. 


Updated Date - 2022-08-13T16:48:40+05:30 IST