Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 11 Feb 2022 10:51:24 IST

విచారణ ముగిసేదాకా ధార్మిక దుస్తులు ధరించొద్దు..! విద్యార్థులకు కర్ణాటక హైకోర్టు సూచన

twitter-iconwatsapp-iconfb-icon
విచారణ ముగిసేదాకా ధార్మిక దుస్తులు ధరించొద్దు..! విద్యార్థులకు కర్ణాటక హైకోర్టు సూచన

అవే వేసుకుంటామని ఒత్తిడి తేవొద్దు..

విద్యార్థులకు కర్ణాటక హైకోర్టు సూచన

నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలు తెరవాలి

కేసును వీలైనంత త్వరగా తేల్చేస్తాం: కోర్టు


బెంగళూరు/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): హిజాబ్‌ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం పరిష్కారమయ్యేదాకా విద్యాసంస్థల ప్రాంగణాల్లో ధార్మిక దుస్తులు ధరించొద్దని కర్ణాటక హైకోర్టు విద్యార్థులకు సూచించింది. హిజాబ్‌, కాషాయ కండువాలు ధరిస్తామని ఒత్తిడి తెస్తే ప్రజలను రెచ్చగొట్టినట్లు అవుతుందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూసేసిన స్కూళ్లు, కాలేజీలను శుక్రవారం నుంచే తెరవాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. తుది తీర్పు ప్రకటించే దాకా విద్యార్థులెవరూ ధార్మిక దుస్తులతో తరగతులకు రావద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రుతురాజ్‌ అవస్థి, జస్టిస్‌ జేఎం ఖాజీ, జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘ముందు కాలేజీలు, స్కూళ్లు ప్రారంభం కావాలి.


ఈ వ్యవహారం తేలేదాకా హిజాబ్‌, కాషాయ కండువా వేసుకుంటామని విద్యార్థులు అనకూడదు’ అని పేర్కొంది. అయితే దీనిని అమలు చేస్తే రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం తన కక్షిదారుల రాజ్యాంగ హక్కులను సస్పెండ్‌ చేయడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది దేవదత్‌ కామత్‌ పేర్కొన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. ఇది కొద్ది రోజులు మాత్రమేనని, రోజువారీ విచారణ జరుపుతామని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదావేశారు. కాగా విద్యాలయాల్లో యథాతథ స్థితిని కొనసాగిస్తూ.. శుక్రవారం నుంచి వాటిని తిరిగి తెరవాలన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హిజాబ్‌, కాషాయ కండువాలను స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించరాదన్న త్రిసభ్య బెంచ్‌ మధ్యంతర ఆదేశాల అమలుపై ముఖ్యమంత్రి బొమ్మై గురువారం అధికారులు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దీంతో సోమవారం నుంచి పదోతరగతి వరకు అనుమతించాలని, ఆ పై పీయూ (ప్రీ యూనివర్సిటీ)తరగతులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 


కర్ణాటక హైకోర్టు ఏం చేస్తుందో చూద్దాం

విద్యాసంస్థల్లో హిజాబ్‌ వ్యవహారం కర్ణాటక హైకోర్టు ముందుందని.. తొలుత కేసును విచారించి దానినే నిర్ణయించనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తర్వాత దానిని తమ వద్దకు బదిలీచేసుకోవాలన్న వినతిని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం గురువారం తెలిపింది. కర్ణాటక హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకోవాలని.. దానిని విచారణ నిమిత్తం 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ కోరారు. కర్ణాటకకు చెందిన కాలేజీ విదార్థిని ఫాతిమా బుష్రా ఈ విషయంలో పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. హిజాబ్‌పై ఆంక్షలతో ఆమె ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. తన వినతిని విచారణ జాబితాలో చేర్చాలని మాత్రమే అడుగుతున్నానని, ఎలాంటి ఆదేశాలూ కోరడం లేదని తెలిపారు. ‘సరే.. పరిశీలిస్తాం’ అని చీఫ్‌ జస్టిస్‌ రమణ అన్నారు. పరీక్షలు ఇంకో రెండు నెలలలు మాత్రమే ఉన్నాయని.. ఇది కర్ణాటక వివాదమే అయినా దేశమంతటా పిల్లలు పాలుపంచుకుంటున్నారని సిబల్‌ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మేమేం చేయలేం. హైకోర్టునే నిర్ణయించనివ్వండి. ఈ సమయంలో మేం జోక్యం చేసుకోవడం తొందరపాటవుతుంది. ఇప్పుడు గనుక దీనిని మా విచారణ జాబితాలో చేర్చితే హైకోర్టుఎప్పుడూ విచారణ జరిపే ఆస్కారముండదు. ఒకట్రెండు రోజులు సమయమివ్వండి’ అని రమణ అన్నారు. సిబల్‌ మరింత ఒత్తిడి తేవడంతో.. కేసును విచారణ జాబితాలో చేర్చాలన్న వినతిని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. కాగా.. హిజాబ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం మరో వ్యాజ్యం దాఖలైంది. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, ఓ జర్నలిజం విద్యార్థి ఈ పిటిషన్‌ వేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.