భార్య అంటే తన శృంగార కోరికలు తీర్చే బానిసగా భావించే మగవారికి కర్ణాటక హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదని, భార్యకు ఇష్టం లేని సంభోగం కచ్చితంగా అత్యాచారం కిందకే వస్తుందని పేర్కొంది. తన భర్త తనను ఓ సెక్స్ బానిసగా చూస్తున్నాడని, కూతురి ఎదురుగానే శృంగారం చేస్తున్నాడని, అసహజ శృంగారం కోసం తనను బలవంతం చేస్తున్నాడని కర్ణాటకకు చెందిన ఓ మహిళ తన భర్తపై అత్యాచారం కేసు పెట్టింది.
ఆ కేసుపై ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనపై పెట్టిన అత్యాచారం కేసును కొట్టెయ్యాలని పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. `ఐరోపా, అమెరికా లాంటి దేశాల్లో మహిళ సమ్మతి లేకుండా భర్త సంభోగానికి పాల్పడితే దాన్ని నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్లో సామాజిక కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల పేరిట ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి వెళ్లడం లేదు. దాంతో భర్త తన భార్యను సొంత ఆస్తిగా భావిస్తున్నాడు. ఆమె అస్థిత్వాన్ని గుర్తించడం లేద`ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
`భార్యాభర్తల బంధమైనా సరే.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుంది. మహిళతో బలవంత శృంగారం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాల`ని అన్నారు. మారిటల్ రేప్ (భార్యలపై లైంగికదాడి) విషయంలో దేశంలో చర్చ జరగాలని, మహిళల వేదనను గుర్తించి మారిటల్ రేప్ చట్టంలో మార్పులు తేవాలని న్యాయమూర్తి సూచించారు.