Karnatka High court: భార్యను కేవలం కామధేనువుగా చూడటం క్రూరత్వమే అవుతుంది

ABN , First Publish Date - 2022-07-20T22:28:28+05:30 IST

భార్యను కేవలం కామధేనువుగా (Cash Cow) మాత్రమే చూస్తూ ఎలాంటి మానవీయ సంబంధాలు లేకుండా వ్యవహరించడం..

Karnatka High court: భార్యను కేవలం కామధేనువుగా చూడటం క్రూరత్వమే అవుతుంది

బెంగళూరు: భార్యను కేవలం కామధేనువుగా (Cash Cow) మాత్రమే చూస్తూ ఎలాంటి మానవీయ సంబంధాలు లేకుండా వ్యవహరించడం వేధింపుల కిందకే వస్తుందని, ఈ తరహా వైఖరి ఆమె భర్త క్రూరత్వానే చాటుతుందని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. బెంగళూరుకు చెందిన ఓ గృహిణికి ఇటీవల విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


విడాకులు కావాలంటూ బెంగళూరు రూరల్ జిల్లాకు చెందిన ఫ్యామిలీ కోర్టును సదరు మహిళ 2020 జూన్ 22న ఆశ్రయించింది. భర్త క్రూరత్వం కారణంగానే తాను విడాకులు కోరుతున్నానని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే, క్రూరత్వం అనే కారణం సహేతుకంగా లేదంటూ ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీనిని  హైకోర్టుకులో ఆమె సవాలు చేశారు. జస్టిస్ అలోక్ అరథే సారథ్యంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. తన భర్త కోసం ఇంతవరకూ రూ.60 లక్షలు వెచ్చించాననంటూ ఇందుకు సంబంధిచిన లావాదేవీలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది.


''చీఫ్ అప్పిలెంట్ (భార్య) చూపించిన ఆధారాలను బట్టి ఆమెను కామధేనువుగానే భర్త భావించాడని, ఆమె పట్ల యాంత్రికంగానే వ్యవహరించాడని చెప్పాలి. భార్య పట్ల అతనికి ఎలాంటి భావోద్వేగాలు లేవు. ఇందువల్ల అప్పిలెంట్ మానసికంగా నలిగిపోయింది. ఇది మానిసిక క్రూరత్వం కిందకే వస్తుంది'' అని డివిజన్ బెంచ్ తన తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిన తీర్పులను కూడా బెంచ్ ప్రస్తావించింది. క్రూరత్వం అనేది ఆయా కేసుల్లోని వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగానే నిర్ధారించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో పేర్కొందని తెలిపింది. ఈ కేసు విషయంలో పిటిషనర్ భార్యను దిగువ కోర్టు క్రాస్ ఎగ్జామిన్ చేయలేదని, ఆమె స్టేట్‌మెంట్లను రికార్డు చేయలేదని బెంచ్ పేర్కొంది.


కేసు పూర్వాపరాలు..

కోర్టుకు వెళ్లిన ఈ జంట1999 మే 17న చిక్కమగళూరులో వివాహం చేసుకుంది. 2001లో వీరికి ఆడపిల్ల పుట్టింది. 2017 జూన్ 8న తనకు విడాకులు కావాలంటూ డైవర్స్ యాక్ట్‌లోని సెక్టన్ 10 కింద భార్య పిటిషన్ వేసింది. హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ఆమె ఆ వివరాలను పొందుపరుస్తూ, తన భర్త కోసం, కుటుంబం కోసం తాను రూ.60 లక్షలు వరకూ ఖర్చుపెట్టానని, కుమార్తెకు దూరంగా తాను బతుకుతున్నానని తెలిపింది. తన గురించి భర్త ఏరోజూ పట్టించుకోలేదని, తాను మాత్రం ఎన్నోసార్లు వ్యాపారంలో దెబ్బతిన్న భర్తను ఆదుకుంటూ, అప్పులు తీర్చే విషయంలో చోదోడువాదోడుగా నిలిచానని తెలిపింది. ఆర్థిక సమస్యల కారణంగా తరచు తమ మధ్య పోట్లాట జరిగేదని చెప్పింది. తన భర్త తన గురించి కానీ, ఆర్థిక అవసరాల గురించి కానీ పట్టించుకోకపోవడంతో తానే పనిచేసి సంపాదించాలని నిర్ణయించుకున్నానని, యూఏఈ వెళ్లానని, అబుదబిలోని కమర్షియల్ బ్యాంకులో పనిచేశానని తెలిపింది. భర్త రుణాలు తీర్చాడం మొదలుపెట్టానని తెలిపింది. 2012 తన భర్త, కుటుంబం తన భావోద్వోగాలను సొమ్ము చేసుకుంటున్న విషయం గ్రహించానని, తాను విడాకులు కోరగా, అతను నిరాకరించాడని చెప్పింది. భర్తకు మరో అవకాశం ఇచ్చి చూద్దామని అతన్ని ఇన్వెస్టర్ వీసాపై యూఏఈ తీసుకు వెళ్లానని, సెలూన్ కూడా పెట్టించానని తెలిపింది. 2013లో ఇండియా వెళ్లిపోవాలని అతను కోరుకున్నాడని, 2017లో తాను ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం పిటిషన్ వేశానని ఆమె తెలిపింది.

Updated Date - 2022-07-20T22:28:28+05:30 IST