బెంగళూరు : కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ బిల్లును శాసన సభ గత డిసెంబరులో ఆమోదించింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక తొమ్మిదోది.
తప్పుడు వివరణ, బలవంతం, మోసం, అనుచిత ప్రలోభాలు, నిర్బంధం, లేదా, పెళ్లి వంటి కారణాలతో ఒక మతం వారు మరొక మతంలోకి మారడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది. ఈ చట్టం ప్రకారం నేరానికి పాల్పడినవారికి కనీసం మూడేళ్ళ నుంచి గరిష్ఠంగా ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు, అంతేకాకుండా రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. మైనర్, మహిళ, షెడ్యూల్డు కులాలు లేదా షెడ్యూల్డు తెగలకు చెందినవారిని చట్టవిరుద్ధంగా మతం మార్చినవారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టానికి వ్యతిరేకంగా సామూహిక మతమార్పిడులకు పాల్పడినవారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1,00,000 వరకు జరిమానా విధించవచ్చు.
మతం మారాలనుకునేవారు కనీసం 60 రోజులు ముందుగా డిప్యూటీ కమిషనర్‌కు తెలియజేయాలని ఈ చట్టం చెప్తోంది. మతం మారిన తర్వాత 30 రోజుల్లోగా ఆ విషయాన్ని తెలియజేయాలని పేర్కొంది.
ఇదిలావుండగా, బెంగళూరు ఆర్చ్ బిషప్ పీటర్ మచడో సోమవారం గవర్నర్ గెహ్లాట్‌ను కలిసి, ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని కోరారు. ప్రజల హక్కులకు, మరీ ముఖ్యంగా మైనారిటీల హక్కులకు ఈ బిల్లు విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి