కర్ణాటక కాంగ్రెస్ మీడియా ప్రతినిధిపై వేటు

ABN , First Publish Date - 2021-10-14T00:02:31+05:30 IST

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ ఎంఏ

కర్ణాటక కాంగ్రెస్ మీడియా ప్రతినిధిపై వేటు

బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ ఎంఏ సలీం ఆరు సంవత్సరాలపాటు ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బయటపడటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోలో మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప కూడా ఉన్నారు. 


డీకే శివ కుమార్, ఆయన సహచరులు లంచాలు స్వీకరించారని సలీం చెప్తున్నట్లు లీక్ అయిన వీడియోలో కనిపిస్తోంది. అంతకుముందు ఆరు నుంచి ఎనిమిది శాతం ఉండేదని, అది 10 నుంచి 12 శాతం అయిందని సలీం చెప్పారు. ఇదంతా డీకే శివ కుమార్ చేసిన సర్దుబాటు అని, ఆయన సహచరుడు ముల్గుండ్ దాదాపు రూ.50 కోట్లు నుంచి రూ.100 కోట్లు వరకు సంపాదించుకున్నారని, అలాంటపుడు డీకే శివకుమార్ ఇంకెంత సంపాదించుకుని ఉంటారో ఊహించుకోవచ్చునని అన్నారు. 


ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకెళ్ళారు. సలీంను ఆరు సంవత్సరాలపాటు పార్టీ నుంచి బహిష్కరించాలని ఈ సంఘం నిర్ణయించింది. ఉగ్రప్పకు షోకాజ్ నోటీసు పంపించింది. 


ఉగ్రప్ప బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, డీకే శివ కుమార్‌పై అవినీతి ఆరోపణలను తోసిపుచ్చారు. శివ కుమార్ ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. కమిషన్లు, అవినీతికి కాంగ్రెస్ చాలా దూరమని చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. డీకే శివ కుమార్‌పై బీజేపీ చేసిన ఆరోపణలను సలీం ప్రస్తావించారని తెలిపారు. 


Updated Date - 2021-10-14T00:02:31+05:30 IST