Droupadi Murmu పై ఈసీకి కర్ణాటక కాంగ్రెస్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-19T23:33:45+05:30 IST

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక కాంగ్రెస్ మంగళవారంనాడు ఫిర్యాదు..

Droupadi Murmu పై ఈసీకి కర్ణాటక కాంగ్రెస్ ఫిర్యాదు

బెంగళూరు: ఎన్డీయే (NDA) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)పై ఎన్నికల కమిషన్‌కు (EC) కర్ణాటక కాంగ్రెస్ మంగళవారంనాడు ఫిర్యాదు చేసింది. ఈనెల 18వ తేదీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సందర్భంగా చట్ట సభ్యులకు లంచం, ప్రలోభాలు ఆశచూపించారంటూ (Bribery and undue influence) ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప సారథ్యంలో కాంగ్రెస్ డిలిగేషన్ ఈసీకి ఈ ఫిర్యాదు చేసింది. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్ సంతకాలు చేశారు.


రాష్ట్రపతి ఎన్నికలకు ఒకరోజు ముందు ఈనెల 17వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలను 5 నక్షత్రాల హోటల్‌కు పిలిపించి, శిక్షణా కార్యక్రమం పేరుతో వారికి ఖరీదైన రూమ్‌లు బుక్ చేశారని, ఆహారం, మద్యం సరఫరా చేయడంతో పాటు వినోదకార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 18న ఓటింగ్ కోసం దాదాపు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నేతలను బీఎంటీసీ ఎయిర్‌కండిషన్డ్ బస్సులో హోటల్ నుంచి విధాన సౌధకు తీసుకువెళ్లారని తెలిపారు. ఇవన్నీ  లంచం తప్ప మరొకటి కాదని, ద్రౌపది ముర్ము గెలుపును ప్రభావితం చేసేందుకు ఓటర్లను (ఎమ్మెల్యేలను) ప్రలోభ పెట్టడమేనని కాంగ్రెస్ పార్టీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ చర్యలన్నీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా బీజేపీ జోక్యం చేసుకోవడం కిందకే వస్తాయని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ సతీష్ రెడ్డి, తదితరులపై కేసులను ఈసీ నమోదు చేయాలని కోరారు. ముర్ముకు పోలైన ఓట్లు చెల్లనివిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-19T23:33:45+05:30 IST