వారికి రిజర్వేషన్‌ పెంచుతాం: CM

ABN , First Publish Date - 2021-10-21T18:01:32+05:30 IST

చట్ట పరిధిలో వాల్మీకి కులస్తుల రిజర్వేన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్ర వ్యా

వారికి రిజర్వేషన్‌ పెంచుతాం: CM

 - 11 మందికి వాల్మీకి పురస్కారాలు ప్రదానం 

 - నగరంలో ఘనంగా వాల్మీకి జయంతి 


బెంగళూరు(Karnataka): చట్ట పరిధిలో వాల్మీకి కులస్తుల రిజర్వేన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పలు కార్యక్రమాలు జరిగాయి. బెంగళూరు విధానసౌధ బ్యాంకెట్‌హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సందర్భంగా ఆయన 2020, 2021 సంవత్సరానికిగాను మొత్తం 11 మంది సాధకులకు వాల్మీకి పురస్కారాలు అందచేసి ఘనంగా సత్కరించారు. 2020 సంవత్సరానికిగాను డాక్టర్‌ కేఆర్‌ పాటిల్‌, బీఎల్‌ వేణు, గౌరి కొరగ, మారప్పనాయక్‌, హెచ్‌ తిప్పేస్వామిలకు, 2021 సంవత్సరానికిగాను కేసీ నాగరాజ్‌, లక్ష్మీగణపతి సిద్ది, ప్రొఫెసర్‌ ఎస్‌ఆర్‌ నిరంజన, భట్రహళ్లి గూళప్ప, అశ్వత్థరామయ్య, జంబయ్యనాయకలకు పురస్కారాలు అందచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచనలు నేటి సమాజానికి దారిదీపంగా ఉన్నాయన్నారు. వీరంతా వివిధ రంగాలలో గణనీయసేవలందించిన వారు కావడం విశేషం. వాల్మీకి జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడమే కాకుండా సెలవు ప్రకటించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వాల్మీకి కులస్తుల సంక్షేమానికి తీసుకుంటున్న పలు కార్యక్రమాలను సీఎం సభకు వివరించారు. ఎస్టీ కేటగిరీలోకి వచ్చే వాల్మీకి కులస్తులకు విద్య, ఉద్యోగాలలో మరింతగా అవకాశం లభించాల్సి ఉందని పీఠాధిపతి ప్రసన్నానందపురి స్వామిజీ సూచనకు సీఎం స్పందించారు. మొత్తం రిజర్వేషన్‌లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయనిపుణులతో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి సమాజంలో మార్పునకు గొప్ప సంకేతమంటూ సీఎం కొనియాడారు. వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచంలోని పది అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటిగా ఉండడం మన అదృష్టమన్నారు. మనిషిలో మార్పు, తద్వారా సమాజంలో చైతన్యంకోసం వాల్మీకి తన రచనల ద్వారా ఎంతగానో శ్రమించారన్నారు. వాల్మీకులు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నారన్నారు. వాల్మీకి గురుపీఠానికి చెందిన ప్రసన్నానందపురిస్వామిజీ, రవాణా, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T18:01:32+05:30 IST