లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ప్రజలకు వివరిస్తాం : కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2022-04-05T20:27:45+05:30 IST

కర్ణాటకలో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ప్రజలకు వివరించి తగిన విధంగా

లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ప్రజలకు వివరిస్తాం : కర్ణాటక సీఎం

బెంగళూరు : కర్ణాటకలో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ప్రజలకు వివరించి తగిన విధంగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. తాము హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలనుకుంటున్నామని, బలవంతంగా దేనినీ తాము రుద్దడం లేదని స్పష్టం చేశారు. 


మసీదుల్లో లౌడ్‌స్పీకర్లను భారీ శబ్దం వెలువడే విధంగా వినియోగించడంపై మహారాష్ట్రలో చర్చ ప్రారంభమైంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇటీవల మాట్లాడుతూ, తాను ఏ మతానికీ వ్యతిరేకం కాదన్నారు. అయితే మసీదుల నుంచి వెలువడుతున్న శబ్దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, తమ పార్టీ కార్యకర్తలు మసీదుల ముందు హనుమాన్ చాలీసాను వినిపిస్తారని తెలిపారు. అయితే మహారాష్ట్రలో అధికార కూటమి భాగస్వామి  శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఇది బీజేపీ కార్యక్రమమని ప్రజలు భావిస్తున్నారన్నారు. దేశ చట్టాలు అమలవుతాయన్నారు. హోం మంత్రి చట్టం ప్రకారం చర్యలు చేపడతారన్నారు. మహారాష్ట్ర మంత్రి దిలీప్ పటేల్ మాట్లాడుతూ, కొందరు సమాజంలో విభజన తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 


ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సోమవారం మాట్లాడుతూ, రాజ్ థాకరే వ్యాఖ్యలపై స్పందించారు. రాజ్ థాకరే లేదా శ్రీరామ్ సేన చేస్తున్న డిమాండ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లింలను విశ్వాసంలోకి తీసుకుంటామన్నారు. ఉదయం, సాయంకాలం సమయాల్లో మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల నుంచి వెలువడుతున్న శబ్దం వల్ల రోగులు, చిన్న పిల్లలు, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చాలా కాలం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ఆందోళనను పరిష్కరించేందుకు ఓ మార్గాన్ని కనుగొనాలన్నారు. మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లకు పోటీగా హనుమాన్ చాలీసాను పెద్ద శబ్దంతో వినిపించడంపై పోటీ పడబోమని తెలిపారు. ముస్లింలు ప్రార్థన చేసుకోవడం పట్ల తమకు అభ్యంతరాలు లేవన్నారు. మసీదుల్లో వినిపిస్తున్నట్లుగానే దేవాలయాలు, చర్చిల్లో కూడా పెద్ద శబ్దంతో పూజలు, ప్రార్థనలను వినిపిస్తే ప్రజల మధ్య ఘర్షణ ఏర్పడుతుందని చెప్పారు. 


ముఖ్యమంత్రి బొమ్మయ్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘ఇది హైకోర్టు ఆదేశం. ఇది బలవంతంగా రుద్దుతున్నది కాదు. ప్రతి దానినీ ప్రజలకు వివరించి, వారితో మాట్లాడి చేస్తాం’’ అని చెప్పారు. ఇది కేవలం అజాన్‌కు మాత్రమే పరిమితం కాదని, అన్ని లౌడ్‌స్పీకర్లకు వర్తిస్తుందని తెలిపారు. తాము దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


Updated Date - 2022-04-05T20:27:45+05:30 IST