మంత్రివర్గ విస్తరణ 6న... కాంగ్రెస్, జేడీఎస్ రెబల్స్‌కు పెద్దపీట

ABN , First Publish Date - 2020-02-02T19:08:32+05:30 IST

మంత్రివర్గంలో మొత్తం 13 మందికి కొత్తగా కేబినెట్ పదవులు దక్కనున్నాయని, వీరిలో 10 మంది కాంగ్రెస్, జేడీఎస్‌ నుంచి బీజేపీలోకి చేరిన రెబల్స్ ఉండనున్నారని..

మంత్రివర్గ విస్తరణ 6న... కాంగ్రెస్, జేడీఎస్ రెబల్స్‌కు పెద్దపీట

ఈనెల 6న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ జరపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. రాజ్‌భవన్‌లో 10.30 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. మంత్రివర్గంలో మొత్తం 13 మందికి కొత్తగా కేబినెట్ పదవులు దక్కనున్నాయని, వీరిలో 10 మంది కాంగ్రెస్, జేడీఎస్‌ నుంచి బీజేపీలోకి చేరిన రెబల్స్ ఉండనున్నారని తెలుస్తోంది.  

గత డిసెంబర్ 5న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గరిష్ట స్థానాల్లో గెలిచి సొంతంగా మెజారిటీ సాధించింది. అప్పట్నించి సుమారు రెండు నెలలుగా మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతూ వచ్చింది. యడియూరప్పను సీఎంను చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన వారి నుంచి 

ప్రధానంగా యడియూరప్పపై ఒత్తిడి ఉంది. గత జూలైలో క్యాబినెట్ విస్తరణ జరిపినప్పటి నుంచి ఈ ఒత్తడి పెరుగుతూ వస్తోంది. మొత్తం 17 మంది పార్టీ ఫిరాయింపుదారుల్లో 13 మందికి గత డిసెంబర్‌ ఉపఎన్నికల్లో టిక్కెట్లు లభించాయి. వారిలో 11 మంది గెలిచారు. దీంతో యడియూరప్ప పదవుల కేటాయింపు విషయంలో మరింత క్లిష్ట పరిస్థితుల్లో పడ్డారు. కోర్టుల ముందు ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో రెండు సీట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.

కాగా, పార్టీ విధేయులను పక్కనపెట్టి బీజేపీకిలోకి ఫిరాయించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో పార్టీ అధిష్ఠానం ఎటూ తేల్చకపోవడంతో మంత్రివర్గ విస్తరణ విషయంలో యడియూరప్పకు జాప్యం తప్పలేదు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో ముఖ్యమంత్రి సహా 34 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం యడియూరప్ప క్యాబినెట్‌లో 18 మంది మంత్రులుగా ఉన్నారు. పలువురు ఒకటి కంటే ఎక్కువ శాఖలే చూసుకుంటున్నారు.

Updated Date - 2020-02-02T19:08:32+05:30 IST