Abn logo
Jul 25 2021 @ 15:35PM

భరతమాతకు గుడి కట్టారు...

అభిమాన తారలకు గుడి కడతారు. కుల దైవాలకు ఆలయాలు నిర్మిస్తారు. అక్కడక్కడ కుటుంబ సభ్యులకు కూడా విగ్రహాలు పెట్టించే వాళ్లున్నారు. కానీ, ఇన్ని కులాలు, మతాలు, జాతుల మనుషులకు తల్లి అయిన భరతమాతకు దేవాలయాన్ని ఎందుకు నిర్మించకూడదు? అనుకున్నారు ఉప్పినకెరె గ్రామస్థులు...


కర్ణాటక రాష్ట్రంలోని మండ్యా జిల్లా. పర్యాటకులను అలరించే పర్యాటక ప్రాంతం. కావేరి నదికి అనుసంధానమైన కృష్ణరాజ సాగర్‌ డ్యామ్‌ ఇక్కడే ఉంది. వర్షాకాలంలో డ్యామ్‌ నిండిన తరువాత అనేక మంది పర్యాటకులు తరలివస్తుంటారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన వాళ్లందరూ.. జై భారత్‌ మాత మందిరం ఎక్కడుంది? ఎలా వెళ్లాలి? అనడుగుతున్నారు. దీంతో ఆ గుడికి ప్రాచుర్యం పెరిగింది. అందరూ వింతగా చూస్తున్నారు. ఆలయంలో విగ్రహాల రూపంలో ఉన్న మహనీయుల చరిత్రను ఆరాతీస్తున్నారు.


మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో ఉంటుంది ఉప్పినకెరె గ్రామం. అన్ని పల్లెటూళ్లలాగే తమది పేరులేని ఊరులా నిలిచిపోకూడదని భావించారు గ్రామస్థులు. ఇలా ఆలోచించిన వెంటనే ఏ ఊరి వాళ్లకైనా తట్టే ఐడియా గుడి కట్టాలని!. అయితే ఉప్పినకెరె గ్రామస్థులు మరో అడుగు మందుకు వేసి... కాస్త కొత్తగా ఆలోచించారు. మన దేశానికి తిండి పెట్టేది రైతు. శత్రుదేశాల నుండి కాపాడేది సైనికుడు. గుడి కడితే వీళ్లకు కట్టాలి.. అనుకున్నారు జనం. ఇంకెందుకు ఆలస్యం? ఊరంతా ఒకచోట సమావేశమై కార్యాచరణకు పూనుకున్నారు. పనిలోపనిగా తాము కట్టబోయే జై భారత్‌ మాతా ఆలయంలో దేశాన్ని ఆంగ్లేయుల కబంద హస్తాల నుంచి కాపాడిన మహాత్ముడు గాంధీతో పాటు మరికొందరి విగ్రహాలను ప్రతిష్టించాలని తీర్మానించారు. ఆలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వివేకానంద స్వామి, ఆధునిక మైసూరు పితామహ నాల్వడి కృష్ణ రాజ ఒడయార్‌, జాతీయ కవి కువెంపు, ఒక్కలింగ వంశ విభూషణుడు కెంపేగౌడ, ఆది చుంచనగిరి మఠాధిపతి డా.బాలగంగాధరనాథ స్వామి విగ్రహాలతో పాటు భరతమాత విగ్రహాన్ని చెక్కించారు. మొత్తం ఏడుగురు ప్రముఖుల పవిత్ర ఆలయం సిద్ధమైంది.


పల్లెలు ఐక్యతకు నిదర్శనం అన్నది తెలిసిందే! అయితే కొన్నిసార్లు ఏదైనా పెద్ద కార్యక్రమానికి పూనుకున్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. చిన్న చిన్న మనస్పర్థలు సహజమే! అలాంటి అడ్డంకుల న్నింటినీ అధిగమించారు గ్రామస్థులు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు శివలింగే గౌడ, డైరెక్టర్లతో పాటు గ్రామస్థులంతా కలిసి చందాలు వేసుకున్నారు. ఏడాదిన్నర పాటు శ్రమించి జై భారత్‌ మాత ఆలయాన్ని నిర్మించారు. గుడికి ఒక వైపున జై జవాన్‌, మరోవైపు జైకిసాన్‌ను సూచించే ప్రతిమలు ఏర్పాటు చేశారు. ‘దేశంలో ఎందరో దేవతలకు, రాజకీయ నాయకులకు, గురువులు, తల్లులకు గుడులు కట్టిన వాళ్లు ఉన్నారు. భరతమాతకు ఆలయాన్ని నిర్మించి, ఆదర్శ వ్యక్తుల విగ్రహాలు పెట్టిన సంఘటనలు అరుదు. భారత్‌లోని ప్రతి వ్యక్తి భరతమాతను, రైతులు, సైనికులను గౌరవించాలన్న దృక్పథంతో గుడిని నిర్మించాం’ అన్నారు శివలింగేగౌడ. ఆలయం చుట్టూ సుందరమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అంబేద్కర్‌, లాల్‌బహదూర్‌ శాస్త్రి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. భరతమాత ఆలయ నిర్మాణంతో ఉప్పినకెరెకు ఎక్కడలేని పేరొచ్చింది.

- హిందూపురం రవి, బెంగళూరు

ప్రత్యేకంమరిన్ని...