కేబినెట్‌ విస్తరణకు మరోసారి బ్రేక్

ABN , First Publish Date - 2022-01-11T17:40:27+05:30 IST

రాష్ట్ర కేబినెట్‌కు మేజర్‌ సర్జరీ జరగనుందనే ప్రచారానికి బ్రేక్‌ పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. గడిచిన 20 రోజులుగా జనవరి రెండోవారంలో బీజేపీ అగ్రనేతలు

కేబినెట్‌ విస్తరణకు మరోసారి బ్రేక్

- ఐదు రాష్ట్రాల ఎన్నికలతో వాయిదా

- అమిత్‌షా, నడ్డా రాష్ట్ర పర్యటన వాయిదా


బెంగళూరు: రాష్ట్ర కేబినెట్‌కు మేజర్‌ సర్జరీ జరగనుందనే ప్రచారానికి బ్రేక్‌ పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. గడిచిన 20 రోజులుగా జనవరి రెండోవారంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో మకాం వేసి పూర్తిగా సర్దుబాట్లు చేసి కొత్త కేబినెట్‌ను రూపొందిస్తారని ప్రచారం సాగింది. ఇందుకు అనుగుణంగా 8, 9 తేదీలలో నందికొండలలో మంత్రులు, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈలోగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ రావడం, అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతావైఫల్యం నేపథ్యంలో అగ్రనేతలు బిజీ అయ్యారు. ఈ కారణంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు రాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అగ్రనేతలు రాష్ట్రపర్యటనకు రాకపోవడం, పైగా ఢిల్లీలోనూ వారు అందుబాటులో లేకపోవడంతో కేబినెట్‌కు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేకపోతున్నారు. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రయోగాలను చేయదలిచారు. మంత్రివర్గంలో పలువురిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రమంతటా పార్టీని బలోపేతం చేయాలని ఆర్‌ఎస్ఎస్‌, బీజేపీ అగ్రనేతలు అభిప్రాయమైనట్టు తెలుస్తోంది. ఇందుకు పార్టీ ప్రముఖులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రుల కార్యాచరణపై అధిష్ఠానం జరిపిన సర్వే ఆధారంగా తప్పించాలని భావించారు. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రరూపం దాల్చడం, జాతీయస్థాయి పరిణామాలతో వాయిదాపడినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదనేది స్పష్టమైంది. 

Updated Date - 2022-01-11T17:40:27+05:30 IST