అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

ABN , First Publish Date - 2022-04-28T17:19:42+05:30 IST

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను ప్రారంభించడం తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. కర్ణాటక, నాగాలాండ్‌,

అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

  - మే 9 నుంచి ఢిల్లీలో అధికారులకు కీలక శిక్షణ

  - 54 మంది సీనియర్‌ అధికారులకు ఆహ్వానం

  - ముందస్తు ఊహాగానాలకు బలం


బెంగళూరు: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను ప్రారంభించడం తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. కర్ణాటక, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అధికారులకు ఏకకాలంలో ఈ మాస్టర్‌ శిక్షణ శిబిరాలను మే 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి చెందిన 54 మంది సీనియర్‌ అధికారులను ఐదు బృందాలుగా శిక్షణ కోసం ఆహ్వానించారు. ఐదు బృందాల్లో పాల్గొనాల్సిన అధికారుల పేర్లతో కూడిన జాబితా కూడా నగరంలో బుధవారం విడుదలైంది. ఈ తాజా పరిణామంతో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కనీసం ఆరునెలల ముందుగా శాసనసభకు ఎన్నికలు నిర్వహించే సందర్భాల్లోనూ ఇలా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఆనవాయితీ ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. అయితే ఇవి సాధారణ సమావేశాలని, ఎన్నికలు జరగడానికి ఏడాది సమయం ఉన్న రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి శిక్షణ సమావేశాలను గతంలోనూ ఇలాగే నిర్వహించిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.


ఏయే అంశాలపై చర్చిస్తారంటే...

ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, నామినేషన్‌తో పాటు దాఖలయ్యే అఫిడవిట్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభ్యర్థుల నేరచరిత, ఎన్నికల ఖర్చుపై నిఘా, ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రక్రియ, ఇత్యాది అంశాలపైనే ప్రధానంగా ఈ శిక్షణ శిబిరంలో అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేయనుంది. అదనపు జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఐఏఎస్ తో పాటు కేఏఎస్‌ అధికారులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా శిక్షణ పొందిన మాస్టర్‌ శిక్షకులైన అధికారులు అనంతరం కింది స్థాయి సిబ్బందికి ఇవే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

Updated Date - 2022-04-28T17:19:42+05:30 IST