Sep 17 2021 @ 13:30PM

జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు 'కర్ణన్‌'

మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం 'కర్ణన్‌'. గత ఏప్రిల్‌ నెలలో విడుదలై  హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగానే కాకుండా, కథ పరంగా కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేయగా, అక్కడ కూడా ఆదరణ పొందింది. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టీవీలో టెలికాస్ట్‌ చేయగా, ఈ చిత్రం ఏకంగా 9.4 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇదిలావుంటే, ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా 'కర్ణన్‌' చిత్రం జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. వచ్చే నెల 12 నుంచి 14వ తేదీల్లో జర్మన్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో జరిగే న్యూ జనరేషన్‌ ఇండిపెండెంట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మించగా, సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు.