Abn logo
Sep 25 2021 @ 01:02AM

సీడబ్ల్యూసీ గిడ్డంగి వద్ద కార్మికుల ధర్నా

మంత్రి పేర్ని నాని, మేయర్‌ వెంకటేశ్వరమ్మ చర్చలు

 5వేల టన్నులను రిలయన్స్‌కు అద్దెకు ఇవ్వడంపై ఆగ్రహం

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 24 : మచిలీపట్నం చిలకలపూడిలోని సీడబ్ల్యూసీ గిడ్డంగి వద్ద కార్మికులు శుక్రవారం గేటు వద్ద ధర్నాకు దిగారు. 40 వేల టన్నుల గిడ్డంగిలో ఐదు వేల టన్నులను రిలయన్స్‌కు అద్దెకు ఇవ్వడంపై  కార్మికులు నిరసన తెలిపారు. రిలయన్స్‌ యాజమాన్యం జరిపే ఎగుమతి దిగుమతులు తమకే ఇవ్వాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు ఏఐఎఫ్‌టీయూ నాయకులు వీరబాబు, రవి నాయకత్వం వహించారు. మేనేజర్‌ రామారావు నాయక్‌ గేటు తలుపులు వేశారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. రిలయన్స్‌ లారీని లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో డీఎస్పీ మసుంబాషా, చిలకలపూడి సీఐ అంకబాబు, రూరల్‌ సీఐ కొండయ్య, ఆర్‌పేట సీఐ బీమరాజులు పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గేటు వద్ద ధర్నా కొనసాగించారు. టీడీపీ మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావులు అధికారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించారు. మేనేజర్‌ రామారావు నాయక్‌, రిలయన్స్‌ అధికారులతో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే రిలయన్స్‌కు ఐదువేల టన్నుల గిడ్డంగులను అప్పగించామని మంత్రితో మేనేజర్‌ రామారావు నాయక్‌ తెలిపారు. కార్మికుల సమస్య పరిష్కారం కాకపోవడంతో రాత్రి 7 గంటల వరకు ధర్నా కొనసాగించారు.