కర్మ క్షేత్రం... భారత వర్షం!

ABN , First Publish Date - 2021-06-18T09:25:58+05:30 IST

‘వర్షం’ అనే మాటకు ‘వాన’, ‘సంవత్సరం’ అనే వాడుకలతో పాటు ‘ద్వీపం’, ‘భూభాగం’ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రపంచాన్ని తొమ్మిది వర్షాలుగా... అంటే భూభాగాలుగా పూర్వులు వర్ణించారు. అవి: ఇలావృత, కురు, హిరణ్మయ,

కర్మ క్షేత్రం... భారత వర్షం!

‘వర్షం’ అనే మాటకు ‘వాన’, ‘సంవత్సరం’ అనే వాడుకలతో పాటు ‘ద్వీపం’, ‘భూభాగం’ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రపంచాన్ని తొమ్మిది వర్షాలుగా... అంటే భూభాగాలుగా పూర్వులు వర్ణించారు. అవి: ఇలావృత, కురు, హిరణ్మయ, రమ్యక,  హరి, కేతుమాల, భద్రాశ్వ, కిన్నెర, భారత వర్షాలు. ఈ తొమ్మిది వర్షాలలో పరమ పవిత్రమైనదిగా భారత వర్షాన్ని అభివర్ణించారు. మిగిలిన చోట్ల ఎవరు ఎలాంటి సుఖాలనూ లేదా దుఃఖాలనూ అనుభవించినా... వాటికి మూలమైన పుణ్య, పాప కర్మలను ఆచరించే చోటు భారత వర్షమేనని పేర్కొన్నారు. అందుకే భారత వర్షం కర్మ క్షేత్రం. మానవులు పాప, పుణ్య కర్మలను అనుభవించే చోటుకు ‘స్వర్గం’ అని పేరు. అలాంటి స్వర్గంలో కొంత కర్మ ఫలాన్ని అనుభవించి, కర్మశేషం మిగిలి ఉండగానే జీవులు భూమిని చేరుతూ ఉంటారు. ఇక్కడ మిగిలిన ఫలాన్ని అనుభవిస్తారు. వీటిలో పుణ్య ఫలాలను అనుభవించే వాటిని ‘భౌమ స్వర్గాలు’ అంటారు. అవి ఎనిమిది. ఈ అనుభవాలకు మూలమైన పుణ్యాన్ని అందించేది భరత వర్షం లేదా భారత వర్షం. 


సప్తద్వీపా వసుంధర...

భూమిని ఏడు ద్వీపాలుగానూ పూర్వులు పేర్కొన్నారు. ‘సప్తద్వీపా వసుంధర’ అన్నారు. అవి జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలు. సప్త ద్వీపాలతో కూడిన భూమండలం మొత్తం విస్తీర్ణం ఏభై కోట్ల యోజనాలు. వీటిలోని పుష్కర ద్వీపంలో సకల జగద్గురువైన బ్రహ్మ అంతర్యామిగా ఉంటాడు. బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే పేర్లుకల నాలుగు దిగ్గజాలను లోకాలను కాపాడడానికి అక్కడ నిలిపి ఉంచాడు. భగవంతుడు సకల లోకాలను రక్షించడానికి లోకాలోక పర్వతం మీద కల్పాంతం వరకు వేచి ఉంటాడు. 


భరత వర్షం కథ...

ఇక పరమ విశిష్టమైన జంబూ ద్వీపంలో భాగం భారత వర్షం. దీని వెనుక కథ ఏమిటంటే... స్వాయంభవ మనువుకు మునిమనుమడు నాభి. అతను బలి చక్రవర్తితో స్నేహం చేశాడు, సమస్త భూమండలాన్నీ పరిపాలించాడు. అతని కుమారుడైన ఋషభుడికి పెద్ద కొడుకు భరతుడు. సంసార బంధాల నుంచి మనసును మళ్ళించి, ఘోరమైన తపస్సు చేసిన భరతుడు చివరకు వాసుదేవుణ్ణి చేరుకున్నాడు. అతను ఏలిన భూమండలం కాబట్టి ఇది భరత వర్షంగా జగత్ప్రసిద్ధమయింది. 


భారత వర్షానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంభీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. ఇది ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతించారు. ఇక్కడ జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదని కొనియాడారు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. కాబట్టి ఇక్కడి జనులకు సాధ్యం కానిది ఏదీ లేదు. నారాయణుణ్ణి స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వసంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్టుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞభూమి. 

(బమ్మెర పోతన ‘మహాభాగవతం’ ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు ’

Updated Date - 2021-06-18T09:25:58+05:30 IST