క్వారంటైన్‌లో కరీంనగర్‌ ఎంపీ

ABN , First Publish Date - 2020-09-27T11:07:33+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారా లేక క్వారంటైన్‌లో ఉన్నారా అనే విషయంలో పార్టీ శ్రేణులకు కలవరం

క్వారంటైన్‌లో కరీంనగర్‌ ఎంపీ

- అస్వస్థులయ్యారని పుకార్లు 

- అదేమి లేదంటున్న సన్నిహితులు 

- పార్టీశ్రేణుల్లో గందరగోళం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారా లేక క్వారంటైన్‌లో ఉన్నారా అనే విషయంలో పార్టీ శ్రేణులకు కలవరం కలిగిస్తోంది. కరోనా వ్యాధి బారిన పడిన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పికె కృష్ణదాస్‌కు ఆయన ప్రైమరీ కాంట్రాక్టు కావడంతో క్వారంటైన్‌కు వెళ్ళారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే శుక్రవారం సాయంత్రం సంజయ్‌ అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారని ప్రచారం జరుగడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలవరానికి, గందరగోళానికి దారి తీసింది. సంజయ్‌ కుటుంబసభ్యులు, సన్నిహితులు అదేమి లేదని చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చేందుకు అధికార ప్రకటన  జారీ చేయక పోవడం  గందరగోళానికి తావిస్తోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, జాతీయ కార్యవర్గసభ్యుడు కృష్ణదాసు ఈనెల 8న పార్టీ వ్యవహారాలను చర్చించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఆయనతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్ళిన తర్వాత కృష్ణదాస్‌కు కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.


ఆ తర్వాత పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం కోసం సంజయ్‌ ఈనెల 12న ఢిల్లీకి వెళ్ళారు. సమావేశంలో పాల్గొనే ఎంపీలందరు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంట్‌ కార్యదర్శి సూచించారు. అయితే అప్పటికే కృష్ణదాస్‌కు కరోనా పాజిటివ్‌ రావడం, ఆయనకు తాను ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న విషయాన్ని బండి సంజయ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌, పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రికి తెలిపారు. దీంతో వారు సమావేశాలకు హాజరుకాకుండా క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు తెలిసింది. వారి సూచన మేరకు సంజయ్‌ ఢిల్లీలోని ఒక హోటల్‌ గదిలో ఎయిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం. శుక్రవారం పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని కూడా ఆయన క్వారంటైన్‌లోని తన హోటల్‌ గదిలోనే జరుపుకొని మీడియాకు ఫొటోలు, ప్రకటనలను పంపించారు. అయితే ఆయన శ్వాస తీసుకునే విషయంలో అస్వస్థతకు గురయ్యారని, ఎయిమ్స్‌లో చేరారని శుక్రవారం సాయంత్రం నుంచి ప్రచారం జరుగుతోంది.


దీంతో పలువురు పార్టీశ్రేణులు ఆందోళనకు గురై ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. పార్టీ సోషల్‌ మీడియా గ్రూపుల్లో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఎయిమ్స్‌లో చేరలేదని కొంత అస్వస్థతకు గురై క్వారంటైన్‌లోనే ఉన్నారని పార్టీలోని సన్నిహితవర్గాలు శ్రేణులకు తెలిపినట్లు సమాచారం. కేవలం ప్రైమరీ కాంటాక్టుగా ఉన్నందుకే క్వారంటైన్‌లోకి వెళ్ళిన సంజయ్‌ అస్వస్థతకు గురయ్యారనే విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయా లేక కరోనా పాజిటివ్‌గా మారారా లేక ఆరోగ్యంగానే ఉన్నారా అన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంకానీ, కరీంనగర్‌ ఎంపీ కార్యాలయం నుంచి గానీ స్పష్టమైన ప్రకటన ఏదీ విడుదల చేయకపోవడం పార్టీశ్రేణుల్లో, ప్రజల్లో గందరగోళానికి, అనుమానాలకు తావిస్తోంది. 

Updated Date - 2020-09-27T11:07:33+05:30 IST