కళోత్సవాలకు కరీంనగర్‌ ముస్తాబు

ABN , First Publish Date - 2022-09-29T08:39:25+05:30 IST

అంతర్జాతీయ స్థాయి కళోత్సవాలకు కరీంనగర్‌ ముస్తాబవుతోంది.

కళోత్సవాలకు కరీంనగర్‌ ముస్తాబు

  • రేపు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
  • 3 రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలు
  • తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణ
  • ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి గంగుల

కరీంనగర్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయి కళోత్సవాలకు కరీంనగర్‌ ముస్తాబవుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనున్నారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో ఈనెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికతో పాటు బారికేడ్ల పనులు చురుగ్గా కొనసాగుతుండగా, స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు బుధవారం పనులను పరిశీలించిన ఆయన.. నిర్వాహకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. కళాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. తొలి రోజు శుక్రవారం నాటి ఉత్సవాలను మంత్రి కేటీఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రెండో రోజు శనివారం నాటి కళోత్సవాలకు సినీనటులు ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే కళోత్సవాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కరీంనగర్‌ చేరుకున్నారు. పనుల పరిశీలన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు పుట్టినిల్లయిన కరీంనగర్‌ ఖ్యాతిని చాటిచెప్పేలా కళోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ చరిత్రలోనే మైలురాయిగా ఈ ఉత్సవాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కళోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2022-09-29T08:39:25+05:30 IST