కరీంనగర్: దేవుడికి సమర్పించే పూర్ణఫలం టెంకాయ, పూజ తర్వాత టెంకాయ కొట్టడం సంప్రదాయం. అయితే కొబ్బరికాయను ఖచ్చితంగా సగానికి పగలగొట్టడం కూడా అందరివల్ల కాదు. నిత్యం పూజలు చేసేవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో దృశ్యాలను చూస్తే.. ఇలా కూడా సాధ్యమా? అనే అనుమానం కలుగుతుంది.
సైదాపూర్‌కు చెందిన వీరన్న ఇంట్లో పూజ చేశారు. ఈ సందర్భంగా ఇంటి పెద్దల తలపై కుటుంబసభ్యుల చేతుల్లో పూజారులు టెంకాయలు పెట్టారు. వాయిద్య చప్పుళ్ల మధ్య మంత్రాలు చదువుతుండగా పూజారులు నృత్యం చేశారు. ఆ తర్వాత చుట్టూ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్న కొబ్బరికాయలను దుడ్డు కర్రతో పగలగొట్టారు. కుటుంబ పెద్దల తలపై ఉన్న టెంకాయలను కూడా పగలగొట్టారు. అది కూడా ఒకే దెబ్బకు రెండుగా పగిలే కొట్టారు. స్థానికులంతా ఈ దృశ్యాన్ని ఊపిరిబిగపట్టి ఆశ్చర్యంగా చూశారు.