ఖరీఫ్‌ కష్టాలు

ABN , First Publish Date - 2022-06-27T06:11:18+05:30 IST

సార్వా సాగులో ఈ ఏడాది అన్నీ సమస్యలే కనబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినా ఆ దిశగా వాతావరణం అనుకూలించలేదు.

ఖరీఫ్‌  కష్టాలు

సార్వా సాగులో  వెంటాడుతున్న  సమస్యలు

జూన్‌ నెలలో వర్షపాతం అంతంత మాత్రమే

బోర్ల కింద సాగులో ఇక్కట్లు

చాలా ప్రాంతాల్లో ఇంకా పడని వరినాట్లు

ఎడారులను తలపిస్తున్న చెరువులు

వర్షాల కోసం ఎదురు చూపులు


ఖరీఫ్‌లో రైతుల కష్టాలు గట్టెక్కలేదు.. సాగు ముందుకు సాగక అవస్థలు పడుతున్నారు. ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వర్షాలు కురిసినా చేను తడవ లేదు.. ముఖ్యంగా చెరువుల కింద సాగుచేసే ప్రాంతాల్లో దుక్కులు కూడా ప్రారంభించలేదు. మెట్ట మండలాలైన టి.నరసాపురం, ద్వారకాతిరుమల, చింతలపూడి, వేలేరుపాడు, కుక్కునూరు తదితర ప్రాంతాల్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులు ఆక్రమణలకు గురవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది.. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రకరకాల సమస్యలతో సాగు సక్రమంగా సాగడం లేదని రైతులు వాపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో సార్వా సాగు పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన


ఏలూరుసిటీ, జూన్‌ 26: సార్వా సాగులో ఈ ఏడాది అన్నీ సమస్యలే కనబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినా ఆ దిశగా వాతావరణం అనుకూలించలేదు. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం కూడా రాని పరిస్థితి ఎదురైంది. ఇక గోదావరి కాల్వలకు జూన్‌ 1వ తేదీనే నీటి విడుదల చేసినా డెల్టా ప్రాంతంలో కూడా సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఏలూరు జిల్లాలో సార్వా సాగుకు సంబంధించి సాధారణ వరి విస్తీర్ణం 2,08,129 ఎకరాలుగా ఉన్నది. రైతులు నారుమళ్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఈ సారి సార్వాలో బీపీటీ 5204, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064, ఎంటీయూ 1121, బీపీటీ 1224, ఎంటీయూ 7029 విత్తన రకాలను వేస్తున్నారు. జిల్లాలో సార్వా సాగుకు లక్షా 23 వేల 925 టన్నులు ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. 


ఇంకా నాట్లు పడలేదు

టి.నరసాపురం : మండలంలో చెరువులు చుక్కనీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. వర్షాలు పడినప్పటికీ రైతులు సాగుకు ఇంకా సమాయత్తం కాలేదు. ప్రస్తుతం టి.నరసాపురం మండలం ఏ గ్రామంలోనూ వరినాట్లు ప్రారంభం కాలేదు. మండలంలో ఖరీఫ్‌ సీజన్‌లో 3,578 హెక్లార్లలో రైతులు వరి సాగు చేస్తారు. వీటిలో చెరువులపై ఆధారపడి 302 హెక్టార్లు, వర్షాలపై ఆధారపడి 32 హెక్టార్లు, బోర్లపై ఆధారపడి 3,276 హెక్టార్లలో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ ఏడాది అనుకూలమైన వర్షం పడకపోవడంతో ఇంకా దుక్కులే దున్నలేదు. 


వెలవెలబోతున్న చెరువులు

కుక్కునూరు : వర్షాకాలం ఆరంభమైనప్పటికీ కుక్కునూరు మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఇప్పటి వరకు చెరువులు నీటితో నిండక వెలవెల బోతున్నాయి. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో పత్తి, వరి ప్రధాన పంటలుగా రైతులు సాగు చేస్తారు. ఇప్పటికి కురిసిన వర్షాలకు కొంత వరకు రైతాంగం పొలాల్లో దుక్కులు దున్నగా మరికొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో ఇంకా దుక్కులు కూడా దున్నలేదు. వర్షాలు విస్తారంగా కురిసి దుక్కులు వస్తే పత్తిసాగులో భాగంగా పొలాల్లో గింజలు విత్తడానికి రైతులు సన్నద్ధంగా ఉన్నారు. అలాగే వరినారుమడులు పోయడానికి రైతులు విత్తనాలను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలో ప్రధాన చెరువులైన చీరవల్లి, కివ్వాక, కొత్త చెరువులు ఇంకా నీటితో నిండలేదు. 


ఆక్రమణల చెరలో ..  

చింతలపూడి : తొలకరి ప్రవేశించినా చింతలపూడి మండలంలో వర్షం లేదు. చెరువుల్లోకి నీరు రాలేదు. చింతలపూడి మండలంలో 36 నీటిపారుదల శాఖకు చెందిన చెరువులు, 120 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఒక చెరువు నిండితే అదనపు నీరు దిగువ చెరువుకు తీసుకు వెళ్తుంది. మండలంలోని అధిక భాగం చెరువుల్లో అదనపు నీరు చింతలపూడి సమీపంలోని మేడవరపు చెరువుకు చేరుతుంది. ఈ చెరువు నుంచే ఎర్రకాలువ వరద ప్రవహిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి. పూడిక తీయకపోవడంతో నీటి సామర్ధ్యం తగ్గిపోతుంది. చెరువు వెనుక భాగంలో ఆక్రమించి సాగు చేయడం వలన చెరువులు కుంచించుకుపోతున్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులైతే మొత్తం ఆక్రమించి గట్లు కూడా తొలగించారు. ఈ విధంగా ఎర్రగుంటపల్లిలోని ముత్యాలమ్మ చెరువు నిదర్శనం. ఇదిలా ఉంటే కొన్ని పంచాయతీలలో చెరువులలో చేపల పెంపకానికి వేలం పాటలు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంటారు. వేసవిలో తొలకరి ముందు చేపలు వేట కోసం చెరువులో నీటిని బయటకు తోడేస్తుంటారు. దీంతో కొద్దోగొప్పో ఉన్న నీరు కూడా బయటకు పోయి తొలకరిలో ఆయకట్టు రైతులకు నీరు లేకుండా పోతున్నది.


ముంపు భూముల్లో సందిగ్ధం 

 వేలేరుపాడు : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతున్న వేలేరుపాడు మండలంలో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ ముంపులో ఉన్న ఈ మండలంలో రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ భూములను ప్రభుత్వం రికార్డుల్లోకి మార్చుకుంది. జూలై నెలాఖరు కల్లా నిర్వాసితులను పూర్తిస్థాయిలో పునరావాస కాలనీలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది.జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశాలు ఉన్నందున పంటలు వేస్తే నష్టపోవలసి వస్తుందని ఎట్టి పరిస్ధితు ల్లోను వ్యవసాయానికి అనుమతిచ్చేది లేదంటూ అధికారులు చెబు తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లోనే వేసవి దుక్కులు చేసుకుని పత్తి తదితర పంటలను జూన్‌ రెండవ వారంలోనే వేసుకునేవారు. వరదల భయంతో ఈ ఏడాది మండలంలో పత్తిసాగుకు మొగ్గు చూపడం లేదు. పత్తి, వరి మినహా మిగతా పంటలు సెప్టెంబరు నెలలో వేసుకోవడం ఈ ప్రాంతంలో మొదలవుతుంది. ప్రస్తుతానికి రైతులు సాగుకు కొంత విరామం పాటిస్తున్నారు.








Updated Date - 2022-06-27T06:11:18+05:30 IST