వర్షాలతో.. ఖరీఫ్‌కు ఊపు

ABN , First Publish Date - 2021-07-22T05:43:02+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఉదయం నుంచి విడవకుండా వర్షం పడుతూనే ఉంది.

వర్షాలతో.. ఖరీఫ్‌కు ఊపు

నారుమళ్లు పోసే పనుల్లో రైతుల నిమగ్నం

కాల్వల్లోనూ నీటి విడుదలతో పనులు వేగవంతం


తెనాలి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం ఉదయం నుంచి విడవకుండా వర్షం పడుతూనే ఉంది. పది పదిహేను రోజులుగా అడపాదడపా  కురుస్తున్న వర్షాలతో డెల్టాలో ఖరీఫ్‌ పనులు ఊపందుకున్నాయి. దీనికితోడు కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వల్లో కూడా నీరు వస్తుంది. దీంతో కాల్వల చివరి భూముల రైతులు కూడా వరి నారుమళ్లు, వెదపద్ధతిలో నాట్లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కృష్ణా తీరంలోని అరటి, కంద, తమలపాకు, పసుపు వంటి వాణిజ్య పంటలకు కూడా వరుణుడు లాభాన్నే కలిగించాడు. కృష్ణా పశ్చిమ డెల్టాలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంటే, దీనిలో 4.91 లక్షల ఎకరాలు గుంటూరు జిల్లాలోనే ఉంది. ఏటా ఖరీఫ్‌ పనులకు జూలై మొదటి వారంలోనే శ్రీకారం చుట్టేవారు. ఇటీవలే ఏరువాక పౌర్ణమి వేడుకలు చేసుకున్నారు. అయితే అంతగా వర్షాలు లేక పోవడంతో వ్యవసాయ పనులు  అంతంతమాత్రంగానే సాగాయి. నారుమళ్లు, నాట్లతో పనిలేకుండా ఇప్పటికే దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కొల్లూరు, వేమూరు, చుండూరు, అమృతలూరు, భట్టిప్రోలు, మరికొన్ని కాల్వల ఎగువ భూములున్న మండలాల్లో వెద పద్ధతిలో నాట్లు వేశారు. సుమారు 80 వేల ఎకరాల్లో వెద సాగు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, కాల్వలకు వస్తున్న నీటితో రైతుల్లో ఽధైర్యం వచ్చింది. రైతులు ఖరీఫ్‌ పనులు వేగవంతం చేశారు. బుధవారం ఉదయం నుంచి విరామం లేకుండా పడుతున్న వర్షంతో   ఎక్కువ శాతం నారుమళ్లు పోసేందుకు రైతులు ఉత్సాహం చూపారు. వెద పద్ధతిలో నాట్లు వేసిన రైతులు వాటికి నీరు పెట్టేందుకు సోమవారం వరకు ఆయిల్‌ ఇంజన్లు, విద్యుత్తు మోటార్లపై ఆధారపడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు,   నీటి తడులు పెటే సమస్య లేకుండా పోయింది. రైతులకు మోటర్ల ఖర్చు మిగిలింది. వర్షాలతో చేలల్తో నీరు నిలవడంతో వెద పద్ధతిలో వరి నాట్లు పూర్తి చేసిన రైతులు కాస్తంత ఆందోళనలో ఉన్నారు. నీరు నిల్వ వల్ల మొలకెత్తిన వరి, మొలక దశలో ఉన్న గింజలు వర్షం వల్ల పనికిరాకుండా పోతాయని, మళ్లీ నాట్లు వేసుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. నీరు నిల్వ ఉండే చేలల్లో ఎప్పటికప్పుడు నీటిని బయటకు తీసేస్తే సమస్య ఉండదని వ్యవసాయ శాఖ ఏడీ శ్రీకృష్ణదేవరాయలు రైతులకు సూచిస్తున్నారు. ముసురు కారణంగా తెగుళ్లు రాకుండా నారుమళ్లు పెంచే రైతులు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. 

 

 



Updated Date - 2021-07-22T05:43:02+05:30 IST