పేరు గొప్పే.. కానీ..

ABN , First Publish Date - 2022-07-07T05:51:16+05:30 IST

కరపలో బాలికల జూనియర్‌ కళాశాల పరిస్థితి అయోమయంగా ఉంది. ప్రభుత్వం ఆగమేఘాల మీద కరప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను బాలికల జూనియర్‌ కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసి ఈ విద్యాసంవత్సరం నుంచే కళాశాల నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

పేరు గొప్పే.. కానీ..
కరప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

  • కరపలో పేరుకే బాలికల జూనియర్‌ కళాశాల
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేకుండానే నిర్వహణ ఎలా..?
  • అడ్మిషన్‌లు లేవు... టీసీలు ఇవ్వరు...!
  • అధికారుల నిర్వాకంతో అయోమయంలో విద్యార్థులు

కరప, జూలై 6: కరపలో బాలికల జూనియర్‌ కళాశాల పరిస్థితి అయోమయంగా ఉంది. ప్రభుత్వం ఆగమేఘాల మీద కరప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను బాలికల జూనియర్‌ కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసి ఈ విద్యాసంవత్సరం నుంచే కళాశాల నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన కనీస ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమకూర్చకుండానే కళాశాలను నిర్వహించమనడం అధికారుల నిర్లిప్తత, నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. మరోపక్క పదోతరగతి పాసై ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న బాలికలకు టీసీలు ఇవ్వకుండా కరప హైస్కూల్‌ సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ఈ పాఠశాలలో చదివిన బాలికలకు టీసీలు ఆపుతున్నట్టు తెలుస్తోంది. టీసీలు తీసుకుని వీరందరూ వెళ్లిపోతే ఈ కళాశాలలో చేరేవారు కరువవుతారనే ఉద్దేశంతో కావాలనే టీసీలను జారీ చేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనందున సాధారణంగా ఇంటర్‌ అడ్మిషన్‌లు తీసుకుంటారు. ఇక్కడ అడ్మిషన్‌లు తీసుకోకుండా, వేరే కళాశాలలో చేరకుండా టీసీలు ఆపడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

అధ్యాపకులను నియమిస్తారా..?

కరప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఈ ఏడాదినుంచి బాలికల జూనియర్‌ కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. దీంతో ఇంటర్‌ రెండేళ్ల చదువు కోసం తమ పిల్లలను దూరప్రాంతాలకు పంపక్కర్లేదని ఇటు తల్లిదండ్రులు, ఇదే పాఠశాలలో పైచదువులు చదుకోవచ్చని అటు బాలికలు ఆనందించారు. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు చదువుకునేలా అధికార యంత్రాంగం నిర్ణయించి దానికి అనుగుణంగా ప్రస్తుతానికి మూడు గదులను కేటాయించారు. మనబడి నాడు-నేడులో తాజాగా మరో మూడు గదులు మంజూరవడం తో గదుల కొరత ఉండదని భావించారు. ఈ ఏడాది కనీసం 77మంది బాలికలతో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులను నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. విద్యాసంవత్సరం ఆరంభమవుతున్నా నేటికీ ఇక్కడ అడ్మిషన్‌లు తీసుకోవడంలేదు. ఇంటర్‌ విద్యకోసం ప్రత్యేకించి అధ్యాపకులను నియమిస్తారా.. లేక హైస్కూల్‌ ఉపాధ్యాయులను వినియోగిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. 

కనీస సదుపాయాలు లేకుండా..

ప్రత్యేకించి సైన్స్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారా లేక హైస్కూల్‌ ల్యాబ్‌లతో నెట్టుకొస్తారా తెలియడంలేదు. ఇంటర్మీడియట్‌ విద్యకో సం కనీస వసతులు సమకూర్చకుండా మొక్కుబడి తంతుగా కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయడంలో ఆంతర్యమేమిటని పలువురు వి ద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బాలికలకు ఇక్కడ ఇంటర్‌ అడ్మిషన్‌లు ఇస్తామని, టీసీలు తీసుకోకుండా అప్పటివరకు వేచి ఉండాలని హై స్కూల్‌ హెచ్‌ఎం, ఇతర సిబ్బంది తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నా వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కనీస స దుపాయాలు లేకుండా ఇక్కడ తమ పిల్లలను చదవించలేమని పే రెంట్స్‌ తమ నిరాశక్తతను వ్యక్తం చేస్తున్నారు. చినుకుపడితే పాఠశా ల ప్రాంగణమంతా చిత్తడి చిత్తడిగా మారుతుందని, గదులు, ల్యా బ్‌ల కొరతవల్ల విద్యాప్రమాణాలు క్షీణిస్తాయని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కళాశాల నిర్వహణకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని, వెంటనే అడ్మిషన్‌లు స్వీకరించి తరగతులను ప్రారంభించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. లేనిపక్షంలో తక్షణం టీసీలను జారీ చేసి వేరే కళాశాలల్లో చేరే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వంనుంచి ఉత్తర్వులు రాలేదు: డీఈవో

దీనిపై డీఈవో, కాకినాడ ఇన్‌చార్జ్‌ డీవైఈవో సుభద్రను వివరణ కోరగా కరప జడ్పీ ఉన్నత పాఠశాలను గర్ల్స్‌ జూనియర్‌ కళాశాలకు అప్‌గ్రేడ్‌ చేసిన మాట వాస్తవమన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే కళాశాలను నిర్వహించమని ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదన్నారు. టీసీలు ఇవ్వకుండా ఆపుతున్నారనే విషయం తమ దృష్టికి రాలేదని, బాలికలు, వారి తల్లిదండ్రుల ఇష్టప్రకారం వెంటనే టీసీలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-07-07T05:51:16+05:30 IST