విస్తరణ పనుల్లో జాప్యం

ABN , First Publish Date - 2022-06-28T06:25:16+05:30 IST

కరప, పెదపూడి, కాకినాడ రూరల్‌ మండలాలను అనుసంధానం చేసే రహదారి విస్తరణ పనుల్లో ఎడతెరగని జాప్యం ప్రజల పాలిట శాపంగా మారింది. అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వెరసి ప్రయా ణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

విస్తరణ పనుల్లో జాప్యం
కరప మండలం గొడ్డటిపాలెం వద్ద తవ్విన గుంతలోకి వర్షంనీరు చేరిన దృశ్యం

  • కరప-కరకుదురు రహదారికి సమాంతరంగా గోతులు తవ్వి వదిలేసిన వైనం
  • ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
  • ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై ఆగ్రహం

కరప, జూన్‌ 27: కరప, పెదపూడి, కాకినాడ రూరల్‌ మండలాలను అనుసంధానం చేసే రహదారి విస్తరణ పనుల్లో ఎడతెరగని జాప్యం ప్రజల పాలిట శాపంగా మారింది. అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వెరసి ప్రయా ణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

కరపనుంచి పెదపూడి మండలం కరకుదురు వరకు 7.5 కిలోమీటర్ల రహదారిని ఆధునికీకరించేందుకు రూ.15కోట్ల ఎన్‌డీబీ(న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌) నిధులు మంజూరయ్యాయి. కరప, కొరుపల్లి, జడ్‌.బావారం, గొడ్డటిపాలెం, అర ట్లకట్ట, కరకుదురు గ్రామాల్లోని 3.565 కిలోమీటర్ల నిడివిలో ఏడు మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు, మిగిలిన 4 కిలోమీటర్ల మేర ఏడు మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు వేసి ఇరువైపుల సీసీ డ్రైన్‌ నిర్మించడానికి ఈ నిధులను కేటాయించారు. గతఏప్రిల్‌ 25న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీతలు కరపలో ఈ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ పనిని దక్కించుకున్న గుత్తేదారుడు సకాలంలో పనులు ప్రారంభించకుండా తాత్సారం చేశారు. అధికారుల ఒత్తిడితో నెల రోజుల క్రితం పనులు ప్రారంభించి కొరుపల్లి నుంచి కరకుదురు వరకు రోడ్డుకు సమాంతరంగా మూడున్నర మీటర్ల వెడల్పుతో గొతులు తీయించి వదిలివేశారు. అప్పట్నించి ఆయా గ్రామా ల్లో రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు అదుపుతప్పి ఆ గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గోతులు నిండిపోవడంతో ప్రయాణం మరింత భయానకంగా మారిందని పలువురు ఆవేదన చెందుతున్నారు. మరో వారంరోజుల్లో స్కూళ్లు ప్రారంభమై ఈ రూట్లో స్కూల్‌ బస్సులు తిరుగుతాయని, రోడ్డు వెంబడి కిలోమీటర్ల మేర ఉన్న ఈ గోతులవల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గొడ్డటిపాలెం సర్పంచ్‌ వాసంశెట్టి శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి గోతులను పూడ్చాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ పి.లోవరాజును వివరణ కోరగా వర్షాలు పడడంవల్ల పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గోతుల్లోని నీటిని తొలగించి రోలింగ్‌ తర్వాత గ్రావెల్‌తో ఈ గోతులను పూడ్చివేస్తామన్నారు.

Updated Date - 2022-06-28T06:25:16+05:30 IST