బయోపిక్‌ ఆదర్శంగా నిలవాలి

ABN , First Publish Date - 2020-06-06T09:13:30+05:30 IST

మన దేశంలో క్రికెట్‌కున్న స్పాన్సర్లు మరే క్రీడకు లేరు. ఇందుకు వెయిట్‌ లిఫ్టింగ్‌ కూడా మినహాయింపేమీ కాదు. అందువల్ల ప్రతిభ ఉన్నా ఎందరో క్రీడాకారులు...

బయోపిక్‌ ఆదర్శంగా నిలవాలి

శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి సిడ్నీ విశ్వ క్రీడల వరకు సాగిన ఆమె ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు. అనితర సాధ్యమనుకున్న ఒలింపిక్‌ పతకాన్ని ముద్దాడి భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఆ పతక కాంతులు దేశంలోని ఎందరో మహిళల్లో క్రీడాకారిణి కావాలన్న స్ఫూర్తిని రగిల్చాయి. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం తన విజయంతో యావత్‌ భారతావనిని పులకింప చేసిన ఆమే కరణం మల్లీశ్వరి. ఈ ఉక్కు మహిళ జీవితగాథను ఇప్పుడు బయోపిక్‌గా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న వేళ తను ఏమనుకుంటుందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో అకాడమీలు ప్రారంభిస్తా 

ఒలింపియన్‌ కరణం మల్లీశ్వరి 


చాంపియన్లను తయారు చేస్తా

మన దేశంలో క్రికెట్‌కున్న స్పాన్సర్లు మరే క్రీడకు లేరు. ఇందుకు వెయిట్‌ లిఫ్టింగ్‌ కూడా మినహాయింపేమీ కాదు. అందువల్ల ప్రతిభ ఉన్నా ఎందరో క్రీడాకారులు ప్రపంచానికి పరిచయం కాలేకపోతున్నారు. ప్రస్తుతం హరియాణాలోని యమునానగర్‌లో ఒక అకాడమీని నడుపుతున్నా. అయితే, కోస్తాంధ్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అనేక మంది సత్తా గల యువలిఫ్టర్లు తారసపడ్డారు. అలాంటి వారిని వెతికి, సానపెట్టి చాంపియన్లుగా తయారు చేయడానికి హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో అకాడమీలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నా. దీని గురించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలను త్వరలోనే సంప్రదిస్తా. ప్రభుత్వం స్థలం కేటాయించి ప్రోత్సహిస్తే పని ప్రారంభిస్తా.


1987లో వెయిట్‌ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి 2000వ సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం సాధించేదాకా కుటుంబసభ్యులతో పాటు ఎందరో కోచ్‌లు, స్నేహితులు అండగా నిలిచారు. వారికి రుణపడి ఉన్నా. త్వరలో తెరకెక్కబోయే బయోపిక్‌లో నేను పడిన కష్టంతో పాటు నా ఎదుగుదలకు తోడ్పడిన వారి కృషి లోకానికి తెలియజేస్తామంటే చాలా సంతోషమనిపించింది. బయోపిక్‌లో నేను నటించడం లేదు కానీ.. గ్రామీణ ప్రాంతాల్లోని వర్ధమాన క్రీడాకారులకు ఈ చిత్రం ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్లలను బడికి పంపడానికే సంకోచించే కాలంలో నేను క్రీడాకారిణిగా రూపాంతరం చెందడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. సాధన చేస్తున్న క్రమంలో శరీర ఆకృతిలో వచ్చిన మార్పులు కనిపించకుండా ఉండడానికి వదులుగా ఉండే దుస్తులు వేసుకునే దానిని. ఈ తరం లిఫ్టర్లకు అలాంటి బాధలు లేవు కానీ, మన సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. 


కెరీర్‌ ప్రారంభంలో ఒడిదుడుకులు: నా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలసలోని ఊసవానిపేట. నేను పెరిగిన వాతావరణం, ఆ రోజుల్లో క్రీడలకు అక్కడున్న సదుపాయాలు తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. కెరీర్‌ ప్రారంభంలో ఆర్థికంగా, సామాజికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ప్రొఫెషనల్‌ లిఫ్టర్‌గా ఎదుగుతున్న క్రమంలో ‘హిందూజ’ సంస్థ 1991లో దత్తత తీసుకొని 1994లో ప్రపంచ చాంపియన్‌ అయ్యే వరకు స్కాలర్‌షిప్‌ ఇచ్చి ప్రోత్సహించింది. ఆ తర్వాత భారత ఆహార గిడ్డంగుల సంస్థ (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగం లభించింది. అప్పట్నుంచి అందులోనే పనిచేస్తున్నా. ప్రస్తుతం హరిణాయాలో ఎఫ్‌సీఐ జీఎంగా విధులు నిర్వహిస్తున్నా. తల్లిదండ్రులు (మనోహర్‌, శ్యామల), భర్త రాజేష్‌ త్యాగి, ఆప్తులు, మిత్రుల సహకారం, దేవుడి దయతో ఈస్థాయికి చేరుకున్నా.


ఒలింపిక్‌ మెడల్‌ తెచ్చిన మార్పు: సిడ్నీ ఒలింపిక్స్‌ మెడల్‌కు ఆరేళ్ల ముందే 54 కిలోల విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌ (1994)గా నిలిచా. ఆ తర్వాతి ఏడాది కూడా ఆ టైటిల్‌ను నిలబెట్టుకున్నా. 1994, 1998 ఆసియా క్రీడల్లో రజత పతకాలు సాధించినా, గుర్తింపు లభించలేదు. అయితే, ఇప్పటి అథ్లెట్లలా నేను ఆ రోజుల్లో పేరు, డబ్బు గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. సిడ్నీ ఒలింపిక్స్‌ కాంస్య పతకంతో ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతలు, మీడియా ఫాలోయింగ్‌ వచ్చింది. కేంద్రంతో పాటు ఏపీ, హరియాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించి, సత్కరించాయి. ఎక్కడికి వెళ్లినా అందరూ గుర్తుపట్టి ఆదరించడం, ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా పిలవడం కొంతకాలం కొత్తగా అనిపించాయి. ఒలింపిక్‌ మెడల్‌ సాధించాకే నా జీవితంలో ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ఆ మెడల్‌ని చూసినప్పుడల్లా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న ఆనందంలో నా కళ్లు చెమ్మగిల్లుతాయి.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - 2020-06-06T09:13:30+05:30 IST