కుటుంబాల్లో కరోనా విషాదం

ABN , First Publish Date - 2021-05-06T05:51:55+05:30 IST

కరోనా కాటు కుటుంబాల్లో విషాదం నింపుతోంది. కరోనా లక్షణాలతో పలువురు మృతి చెందుతున్నారు.

కుటుంబాల్లో కరోనా విషాదం

గుంటూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

దుగ్గిరాల, గుంటూరు(కార్పొరేషన్‌), తుళ్ళూరు, గుంటూరు, మే 5: కరోనా కాటు కుటుంబాల్లో విషాదం నింపుతోంది. కరోనా లక్షణాలతో పలువురు మృతి చెందుతున్నారు. కరోనా కారణంగా ఒక్కో కుటుంబంలో ఒకరికి తెలియకుండా మరొకరు మృతి చెందుతున్నారు. దుగ్గిరాల మెయిన్‌రోడ్డు ప్రాంతానికి చెందిన  తల్లి, కుమార్తెలు పదిరోజుల వ్యవధిలో మృతి చెందారు. తొలుత కుమార్తె మృతి చెందగా, కరోనా లక్షణాలతో మృతి చెంది ఉండవచ్చన్న బంధువులెవరూ రాలేదు. దీంతో గుంటూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అంత్యక్రియలు నిర్వహించింది. కాగా అప్పటి నుంచి అస్వస్థతతో ఉన్న తల్లి బుధవారం మృతి చెందింది. 

నగరపాలక సంస్థలో కౌన్సిల్‌ సూపరింటెండెంట్‌..

గుంటూరు నగరపాలక సంస్థలో కౌన్సిల్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించే కె.యలమందమ్మ బుధవారం కొవిడ్‌ లక్షణాలతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల నగర కమిషనర్‌ చల్లా అనురాధ, నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు, అదనపు కమిషనర్‌, విభాగాధిపతులు సంతాపం తెలిపారు. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

గుంటూరులోని శ్రీనివాసరావుపేట మాచర్ల వారి వీధికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నజీర్‌ కరోనా లక్షణాలతో మృతి చెందారు. కరోనా లక్షణాలతో రెండు వారాల నుంచి కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండురోజుల క్రితం నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. జనసేన నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, ఆళ్ల హరి తదితరులు నజీర్‌ మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. 

టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మృతి

తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన ఘట్టమనేని లక్ష్మీనారాయణ బుధవారం కరోనా లక్షణాలతో మృతి చెందారు. ప్రస్తుతం టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మీనారాయణ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. చికిత్సలో ఉండగానే స్ట్రోక్‌ రావటంతో లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలు స్వగ్రామం పెదపరిమిలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు లక్ష్మీ నారాయణ మృతికి సంతాపం తెలిపారు. 

మాజీ జడ్పీటీసీ భర్త మృతి

దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన మాజీ జడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి భర్త లింగయ్య(65) కరోనా లక్షణాలతో బుధవారం మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో అస్వస్థతకు గురయ్యారు. కాగా లింగయ్య, చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లింగయ్య మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-05-06T05:51:55+05:30 IST