కరకట్టపై.. నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-26T06:04:08+05:30 IST

కృష్ణానదికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది.

కరకట్టపై.. నిర్లక్ష్యం
మున్నంగి దగ్గర ఇసుక లారీల కారణంగా నదివైపు కరకట్ట అంచు కుంగిపోయి ప్రమాదకరంగా మారిన చిత్రం.


ప్రమాదకరంగా ఏటిగట్టు

ఓవర్‌ లోడ్‌ లారీలతో ఛిద్రం 

గుంతలు.. కుంగుతోన్న అంచులు

కృష్ణమ్మకు పెరుగుతున్న వరద ప్రవాహం

పొంచి ఉన్న ముప్పుతో తీరప్రాంతవాసుల్లో ఆందోళన

గోదావరి అనుభవాలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యేనా?

 

కృష్ణమ్మ పరవళ్లు గట్టు దాటకుండా కరకట్ట కట్టడి చేస్తోంది. అలాంటి కరకట్ట పటిష్ఠత ప్రస్తుతం ప్రమాదకరంగా ఉంది. గతానుభవాలు.. ఇటీవల గోదావరి పరిణామాలు చూసైనా ప్రభుత్వం మేల్కొంటుందా అంటే ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలతో కరకట్ట ఛిద్రమైపోయింది. వరద ప్రవాహంతో కరకట్ట కొన్ని చోట్ల కోతకు గురవగా.. మరికొన్ని దగ్గర్ల కుంగిపోయి ఉంది. దీంతో కరకట్టకు ముప్పు పొంచి ఉంది. ఇదే సమయంలో ఈ ఏడాది కూడా కృష్ణమ్మకు వరద పోటు తప్పేలా లేదు. అయినా కరకట్ట భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ గండి పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రకాశం బ్యారేజి దిగువున 61 కి.మీటర్ల లోపు ఆధునికీకరణ పనులు, రోడ్డు నిర్మాణం చేపట్టినా స్వయంకృతాపరాధం ఇప్పుడు శాపంగా మారుతోంది.  పెనుమూడి నుంచి బ్యారేజి మధ్య కరకట్టను ఆధునికీకరించినా అఽఽధికారుల నిర్లక్ష్యం, ఇసుక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో ప్రమాదం పొంచి ఉంది.


   

తెనాలి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. నదీతీర గ్రామాలకు రక్షణగా నిలవాల్సిన కరకట్టకే రక్షణ లేకుండా పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎగువ నుంచి మరింతగా వరద పెరిగితే కరకట్ట నదీ తీరప్రాంత గ్రామాలకు రక్షణగా నిలుస్తుందా? గోదావరి గట్టు గండ్ల వంటి పరిస్థితులు తలెత్తితే పరిస్థితి ఏమిటోనని ఇప్పటి నుంచి ప్రజల్లో ఆందోళన నెలకొంది. కృష్ణా నది కుడి కరకట్టను పటిష్ఠ పరచాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం దృష్టి సారించలేదు.  ప్రజల ఆందోళనకు తగ్గట్లుగానే రూ.111 కోట్లతో ఆధునికీకరించిన కరకట్ట పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎప్పుడు ఎక్కడ గండి పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నది దిగువున కరకట్ట బలహీనపడిపోయిన తీరు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. చిన్నపాటి కోతలు పడిన ప్రదేశాల్లో మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. కుడి కరకట్టను వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆధునికీకరించేందుకు రూ.141 కోట్లు మంజూరు చేశారు. రెండు విభాగాలుగా పనులను విభజించి ప్రకాశం బ్యారేజి నుంచి పెనుమూడి వరకు 61 కి.మీటర్ల పొడవున కరకట్టను వెడల్పు చేసి, ఎత్తుపెంచి, దానిపై డబల్‌ రోడ్డును రూ.111 కోట్లతో నిర్మించారు. అయితే అక్కడక్కడ కోర్టు వివాదాలు, రైతుల అడ్డంకుల కారణంగా 8 కి.మీటర్లు మాత్రం పనులు జరగలేదు. వల్లభాపురం-పెదకొండూరు మధ్య 4 కి.మీటర్లను రెండు దశాబ్దాల క్రితమే రోడ్డు నిర్మించారు. దీంతో ఈ రోడ్డును ఆధునికీకరణలో పట్టించుకోలేదు. అప్పటికే రోడ్డు దెబ్బతినిపోయినా కొత్తగా వేయకుండా వదిలేశారు. దిగువున పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్టను కేవలం మట్టిపనితో పటిష్ఠ పరిచారు. అయినా వరద సమయంలో సముద్రం ఆటుపోట్లు అధికంగా ఉండే, అమావాస్య, పౌర్ణమి ఘడియల్లోనే కొంత భయం కలిగిస్తుంది.


దెబ్బతింటోన్న కరకట్ట

వల్లభాపురం-పెదకొండూరు మధ్య తారురోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది. మోకాళ్ల లోతులో గుంటలు ఏర్పడ్డాయి. ఇక్కడే కరకట్టకు నదివైపు అంచులు చాలాచోట్ల పాక్షికంగా కోతపడి, గండ్లు పడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 4 కి.మీటర్లలోనే పెదకొండూరు దగ్గర 800 మీటర్ల రోడ్డును అప్పట్లో వేయకుండా నిఽధుల సాకుతో వదిలేశారు. ఇది ఆధునికీకరణలోనూ పూర్తికాలేదు. సింగిల్‌ రోడ్డు, అడుగడుగునా భారీ గుంతలు పడిపోయింది. వర్షపు నీటికే కట్ట కోతకు గురవుతుంది. ఇసుక కాంట్రాక్టర్‌లు కనీసం మట్టికూడా పోయకుండా వదిలేశారు. దీంతో కరకట్ట పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. అప్పట్లోనే విజయవాడ క్లబ్‌ దగ్గర కరకట్టను సింగిల్‌ రోడ్డు వేశారు. ఆ సమయంలో కూడా పెదకొండూరు రోడ్డు వేయకపోవటం, ఇప్పుడు కూడా ఈ నాలుగు కి.మీటర్లను వదిలేయడంతో అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటు మున్నంగి, బొమ్మువానిపాలెం ప్రాంతాల్లోనూ కరకట్ట కుంగిపోయింది. కరకట్టను పటిష్ఠ పరిచే సమయంలో ఆరు చక్రాల లారీలకు అనుగుణంగా పనులు చేశారు. అయితే మారిన పరిస్థితుల్లో పది చక్రాల లారీల నుంచి 12 చక్రాల లారీలు పరిమితికి మించి 40 నుంచి 60 టన్నుల వరకు లోడుతో వెళుతున్నాయి. దీంతో కరకట్ట పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడు నుంచి తెచ్చిన లారీలు, అధికారపార్టీ నాయకులకు చెందిన లారీలు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో కరకట్ట సగం వరకు నదివైపు చాలాచోట్ల కుంగిపోయింది. కొన్నిచోట్ల మధ్య బద్దలుగా పగుళ్లిచ్చి ప్రమాదకరంగా మారింది. మున్నంగి-బొమ్మువానిపాలెం, కొల్లిపర-వల్లభాపురం, అత్తలూరివారిపాలెం-పెదకొండూరు మధ్య పూర్తిగా దెబ్బతినిపోయింది. వల్లభాపురం అండర్‌ స్లూయిజ్‌ దగ్గర మూడు అడుగులపైనే కుంగిపోయింది. గత వరదల సమయంలో ఇక్కడ కోతపడిన ప్రదేశాన్ని ఇసుక మూటలతో పటిష్ఠ పరిచారే కానీ, పూర్తిస్థాయి పనులు చేయలేదు. కొల్లూరు, దోనేపూడి, వెల్లటూరు దగ్గర కరకట్ట ఆధునికీకరణ పనులు జరగనిచోట సింగిల్‌ రోడ్డు నామరూపాలు లేకుండా పోయింది. వెల్లటూరు నుంచి దిగువకు  నీటి పైపులు అక్రమంగా వేసి ఉంచారు. గతంలో ఓలేరు గండికి ఇటువంటి పైపులే కారణమని అప్పట్లో నిపుణుల కమిటీ నిర్ధారించింది. అయినా ఇప్పటి వరకు వీటిపై చర్యలు లేవు. జిల్లాల విభజన తర్వాత శాఖల మధ్య సమన్వయ లోపంతో కరకట్ట భద్రత విషయం మరింత గందరగోళంగా మారింది. ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో నెలకొన్నాయి.  

Updated Date - 2022-07-26T06:04:08+05:30 IST