కాపు రామచంద్రారెడ్డి ద్వారా ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు వసూలు

ABN , First Publish Date - 2020-07-01T15:48:10+05:30 IST

అనంతపురం: డబ్బు వసూళ్ల కోసం ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేరునే ఉపయోగించుకున్నాడో వ్యక్తి.

కాపు రామచంద్రారెడ్డి ద్వారా ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు వసూలు

అనంతపురం: డబ్బు వసూళ్ల కోసం ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేరునే ఉపయోగించుకున్నాడో వ్యక్తి. విషయం తెలుసుకుని రామచంద్రారెడ్డి కంగు తిన్నారు. కాపు రామచంద్రారెడ్డి ద్వారా విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన నాయకుల నాగేంద్రబాబు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.


మోసాపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరుతో నిందితుడు బొమ్మనహల్ మండలం లింగదహాళ్ గ్రామానికి చెందిన కనక లోకేష్ తండ్రి నాగరాజు వద్ద నుంచి రూ.లక్ష, కనేకల్‌కు చెందిన నాగేంద్రరావు అనే వ్యక్తి నుంచి రూ.లక్ష అడ్వాన్స్‌గా తీసుకున్నాడని రాయదుర్గం సీఐ తులసీరామ్ తెలిపారు. ఇంకెవరైనా డబ్బులిచ్చి మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు.


కాగా.. నిందితుడు నాగేంద్రబాబు మీ ద్వారానే ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని బాధితులు ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి భార్య కాపు భారతి దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు అధికారులు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తారు అనే దుష్ప్రచారం చేస్తున్నట్లు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 


Updated Date - 2020-07-01T15:48:10+05:30 IST