నాకు తెలుసు.. ఈ యుద్ధంలో మనం గెలుస్తాం: కపిల్‌దేవ్

ABN , First Publish Date - 2020-03-27T21:29:37+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ..

నాకు తెలుసు.. ఈ యుద్ధంలో మనం గెలుస్తాం: కపిల్‌దేవ్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రజలకు పిలుపునిచ్చాడు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని, కాబట్టి అందరూ ఇంటిపట్టునే ఉండాలని సూచించాడు.  ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఇదొక్కటేనని పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ను సానుకూల దృక్పథంతో చూడాలని కపిల్ కోరాడు. ఈ ప్రాణాంతక వైరస్‌ను అడ్డుకునేందుకు అధికారులు చేస్తున్న పోరాటానికి మీరు చేయవలసింది ఇంట్లో ఉండడమేనని అన్నాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందని, అది మీ కుటుంబమేనని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో గడపడం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, సంగీతం వినడం వంటివి చేస్తూ ఆనందించాలని సూచించాడు.

దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన కపిల్ ఇప్పుడు ఇంట్లో ఉంటూ వివిధ పనులు చేస్తున్నాడు. ‘‘నేను నా ఇంటిని ఊడుస్తున్నాను. తోటను శుభ్రం చేసుకుంటున్నాను. ఇప్పుడీ చిన్న తోట నా గోల్ఫ్ కోర్సు కూడా. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. గత కొన్నేళ్లుగా నేను కోల్పోయినది ఇదే’’ అని కపిల్ పేర్కొన్నాడు. 


ఇప్పుడు తాను వంట మనిషికి విశ్రాంతి ఇచ్చి అందరి కోసం తానే వంట చేస్తున్నానని, ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు నేర్చుకున్నవన్నీ ఇప్పుడు చేసి పెడుతున్నానని కపిల్ వివరించాడు. ప్రజలు ఇప్పుడు పరిశుభ్రత పాఠాల గురించి గుర్తు చేసుకుంటున్నారని, చేతుల కడుక్కోవడం నేర్చుకుంటారని భావిస్తున్నట్టు చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, బహిరంగ మూత్రవిసర్జన వంటి వాటికి దూరంగా ఉంటారని కపిల్ పేర్కొన్నాడు. తాము ఈ పాఠాలను ఎప్పుడో నేర్చుకున్నామని, ఈ తరం ఆ తప్పులు చేయదని ఆశిస్తున్నట్టు చెప్పాడు. క్రికెట్ ఆడుతున్నప్పడు సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకోగలిగానని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నాడు. ప్రస్తుత పరిస్థితి నుంచి దేశం బయటపడుతుందని, ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. తానెప్పుడూ ఆశావహ దృక్పథంతోనే ఉంటానని పేర్కొన్నాడు.


సంక్షోభాలను ఎదుర్కొనేందుకు మానవజాతి ఎలా పోరాడిందో తాను చదివానని, విన్నానని కపిల్ చెప్పుకొచ్చాడు. భారతదేశ బలం మన సంస్కృతిలోనే ఉందన్నాడు. ఒకరికి ఒకరు సాయం చేయడం, పెద్దలకు సాయపడడం వంటివి చేయాలని సూచించాడు. కరోనాపై యుద్ధంలో మనం గెలుస్తామని తనకు తెలుసన్న కపిల్ ఇంట్లో ఉండాలని, ఇంట్లోనే ఉండి కరోనాపై   ప్రభుత్వం, వైద్యులు చేస్తున్న పోరుకు మద్దతుగా నిలవాలని కోరాడు. 

Updated Date - 2020-03-27T21:29:37+05:30 IST