ఇది మంచి పద్ధతి కాదు.. పరిస్థితిని చక్కదిద్దండి: గంగూలీ, కోహ్లీకి కపిల్ సూచన

ABN , First Publish Date - 2021-12-16T22:03:48+05:30 IST

టీమిండియాలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులపై టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్ స్పందించాడు. టీమిండియా..

ఇది మంచి పద్ధతి కాదు.. పరిస్థితిని చక్కదిద్దండి: గంగూలీ, కోహ్లీకి కపిల్ సూచన

న్యూఢిల్లీ: టీమిండియాలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులపై టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్ స్పందించాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత భారత క్రికెట్‌లో కొంత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడం, వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్టు వార్తలు రావడంతో వారిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. 


నిన్న ముంబైలో మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఈ వార్తలను ఖండించాడు. సఫారీ టూర్‌లో ఆడుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే, గతంలో బీసీసీఐ బాస్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండించాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగొద్దని గంగూలీ తనను కోరలేదని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు అరగంట ముందు మాత్రమే తనకు చెప్పారంటూ గంగూలీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. 


భారత జట్టులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కపిల్‌దేవ్ స్పందించాడు. కోహ్లీ ప్రకటన చూస్తుంటే బోర్డుతో అతడికి విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్కరినో వేలెత్తి చూపడం సరికాదని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన దగ్గరపడుతోందని, కాబట్టి ఇలాంటి వాటిని పక్కనపెట్టి సిరీస్‌పై దృష్టిసారించాలని కోరాడు. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ చీఫ్ గంగూలీతో ఉన్న విభేదాలను కోహ్లీ బహిరంగంగా వెల్లడించడం మంచిది కాదని అన్నాడు.


‘‘బోర్డు అధ్యక్షుడంటే అధ్యక్షుడే. కెప్టెన్ కూడా గొప్పే అయినప్పటికీ ఇలా బహిరంగంగా దుమ్మెత్తిపోసుకోవడం సరికాదు. అది కోహ్లీ అయినా, గంగూలీ అయినా’’ అని కపిల్ పేర్కొన్నాడు. ఈ పరిస్థితిని తొలుత చక్కదిద్దాలి. అన్నింటికంటే దేశం ముఖ్యం. తప్పెవరిది అనేది త్వరలోనే తెలుస్తుంది. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం మాత్రం సరికాదు. మరీ ముఖ్యంగా ఇలాంటి సమయంలో అది కరెక్ట్ కాదని అనుకుంటున్నా. ముఖ్యమైన పర్యటన ముందు ఇలాంటి వివాదాలు సరికాదు’’ అని కపిల్  అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2021-12-16T22:03:48+05:30 IST