ఆనాటి అద్భుతం

ABN , First Publish Date - 2021-12-25T05:49:47+05:30 IST

భారత క్రికెట్‌ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో కెక్కుతోంది. సారథ్య బాధ్యతల బదలాయింపునకు సంబంధించి విరాట్‌ కోహ్లీ, భారత క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీల మధ్య విభేదాలు బట్టబయలు కావడం క్రీడావర్గాల్లో....

ఆనాటి అద్భుతం

భారత క్రికెట్‌ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో కెక్కుతోంది. సారథ్య బాధ్యతల బదలాయింపునకు సంబంధించి విరాట్‌ కోహ్లీ, భారత క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీల మధ్య విభేదాలు బట్టబయలు కావడం క్రీడావర్గాల్లో సంచలనం సృష్టించింది. భారత క్రికెట్‌ చరిత్రలో ఇలా కెప్టెన్‌, బోర్డు అధ్యక్షుడి మధ్య విభేదాలు రచ్చకెక్కడం అత్యంత అరుదుగా చూస్తుంటాం. ఈ వ్యవహారం కొంత అపఖ్యాతినే మిగిల్చింది. ఇదిలావుంటే.. అసలు భారత క్రికెట్‌ గమ్యాన్నే మార్చివేసిన 1983 నాటి ప్రపంచ కప్‌ విజయం తాజాగా వార్తల్లో నిలుస్తోంది. అత్యద్భుతమైన ఈ అసాధారణ విజయాన్ని స్ఫురణకు తెచ్చుకునే అవకాశం ఓ చలనచిత్ర రూపంలో నిన్నటితరానికి కలిగింది. తాజాగా పలు భాషల్లో విడుదలైన ‘83’ సినిమా కపిల్‌ డెవిల్స్‌ సాధించిన అమేయమైన విజయాన్ని దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరపై ఆవిష్కరించింది.


సచిన్‌, మేరీకోమ్‌, దంగల్‌, సైనా, అజర్‌, ఎంఎస్‌ ధోనీలాంటి ఎన్నో బయోపిక్‌లు ఎప్పుడో తెరరూపం దాల్చగా, భారత క్రికెట్‌ గతినే మార్చేసిన ప్రపంచకప్‌పై సినిమా వచ్చేందుకు దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టడం ఒకింత ఆశ్చర్యమే. ఆట అంటే మైదానంలో బౌండరీలకే పరిమితమవకుండా నవ్వించే సరదా సన్నివేశాలు, ఆటగాళ్ల మధ్య అల్లుకొన్న భావోద్వేగాలు, విజయగర్వంతో ఉప్పొంగిన ఉద్వేగాలు.. ఇలా అన్నింటి సమాహారంగా ‘83’ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం సినీ, క్రీడాభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. 


ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో భారతజట్టు ఈ ప్రపంచకప్‌ను అందుకున్న వైనం వింటే ఈ తరం క్రీడాభిమానులు ఒకింత సంభ్రమాశ్చర్యాలకు లోనవడం ఖాయం. ఆండీ రాబర్ట్స్‌, మాల్కమ్‌ మార్షల్‌, జోయల్‌ గార్నర్‌, మైకేల్‌ హోల్డింగ్‌ వంటి అరివీర భయంకర బౌలర్లు, వివ్‌ రిచర్డ్స్‌, క్లయివ్‌ లాయిడ్‌ లాంటి అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్న వెస్టిండీస్‌ను ఫైనల్లో ఓడించడం, అంతకుముందు సెమీస్‌లో ఇంగ్లండ్‌లాంటి బలీయమైన జట్టును మట్టి కరిపించడం కేవలం కలలో మాత్రమే సాధ్యమయ్యే విషయాలన్నది అప్పటివారి నమ్మిక. జింబాబ్వేతో మ్యాచ్‌లో కపిల్‌దేవ్‌ సాధించిన 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ ప్రపంచ క్రికెట్‌లో నిస్సందేహంగా ఒక అపురూప ఘట్టమే.


కపిల్‌దేవ్‌ లాంటి స్ఫూర్తిదాయకమైన సారథి నేతృత్వంలో సాధ్యమైన ఈ విజయాన్ని అప్పటి జట్టు సభ్యులే నమ్మలేకపోయారట. ఏకపక్షంగా జరగబోతున్న ఒక చెత్త ఫైనల్‌ మ్యాచ్‌గానే ప్రతిఒక్కరూ భావించారు. లండన్‌లో జరిగిన ఈ ఫైనల్లో భారత్‌ చేసిన స్కోరు కేవలం 183. ఈ స్కోరును వెస్టిండీస్‌ అవలీలగా ఛేదిస్తుంది కాబట్టి, ఆక్స్‌ఫర్డ్‌ స్ర్టీట్‌లో షాపింగ్‌కు వెళ్లొచ్చని జట్టు సభ్యుడు గవాస్కర్‌ సహచరుడు సందీప్‌ పాటిల్‌తో మరాఠీలో అన్నాడట. ఆ మ్యాచ్‌లో మనవాళ్లు ప్రత్యర్థిని 140 పరుగులకే కట్టడిచేసి అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశారు. 


హరియాణాలోని గ్రామీణ ప్రాంతంనుంచి వచ్చిన కపిల్‌దేవ్‌ ఓ సంచలనం. అప్పట్లో క్రికెట్‌ అంటే మెట్రో నగరాలనుంచి వచ్చిన అగ్రవర్ణాల ఆట మాత్రమే. తొలి 50 ఏళ్లలో భారత్‌ తరపున ఆడిన క్రికెటర్లలో ఏడుగురు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో జన్మించినవారు. ఆ ఏడుగురిలో ముగ్గురు 1930లోనే ఆడారు. హరియాణా నుంచి వచ్చిన వాళ్లు ట్రాక్టర్లు నడుపుకోవాలే తప్ప క్రికెట్‌ బంతులు పట్టుకుని ఫాస్ట్‌ బౌలింగ్‌ చేయడమేమిటనే రీతిలో క్రికెట్‌ పెద్దల ఆలోచన ఉండేదని కపిల్‌దేవ్‌ ఓ సందర్భంలో స్వయంగా చెప్పాడు. స్పిన్‌ బౌలర్లు రాజ్యమేలుతున్న కాలంలో పేస్‌ బౌలర్‌గా వచ్చిన కపిల్‌ అరంగేట్రం చేసింది మొదలు వెనుదిరిగి చూసిందిలేదు. కపిల్‌ రాకతో చిన్నపట్టణాలు, గ్రామాలనుంచి క్రికెట్‌ ఆడేందుకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిభాపాటవాలున్నా ప్రోత్సాహం, సరైన మార్గదర్శకత్వం లేకుండాపోయిన ఎంతోమంది ఇతర క్రీడల ఆటగాళ్లకు కూడా కపిల్‌ ఆరాధ్యుడు. ఆ తర్వాత ధోనీలాంటి ఎందరో క్రీడాకారులు భారత కీర్తిపతాకను ఇనుమడింపజేశారు. కాలక్రమంలో మన క్రికెట్‌జట్టు విజయపథంలో నడుస్తూ ప్రపంచ నెంబర్‌వన్‌గా సైతం నిలుస్తోంది. 


క్రికెట్‌ అంటే జాతీయ భావోద్వేగాల అంశంగా మారిపోయిన నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగే ఆట నుంచి మాత్రమే ఆనందావేశాలు పొందడం అలవాటు చేసుకున్న ప్రస్తుత తరానికి, వలసాధిపత్యానికి ప్రతీక అయిన ఇంగ్లండ్‌ను, క్రికెట్‌ దిగ్గజంగా గుర్తింపు పొందిన వెస్టిండీస్‌ను ఓడించడంలోని విజయోత్సాహం ఏమిటో, ఎలా ఉంటుందో అర్థమయ్యే అవకాశం లేదు.1983 నాటి విజయం క్రీడాస్ఫూర్తికే ఒక నమూనా.

Updated Date - 2021-12-25T05:49:47+05:30 IST