దేవీ నవరాత్రులలో కన్యాపూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఏ వయసువారికి చేయాలి? దీనివలన ప్రయోజనమేమిటి?

ABN , First Publish Date - 2021-10-13T17:21:53+05:30 IST

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి.

దేవీ నవరాత్రులలో కన్యాపూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఏ వయసువారికి చేయాలి? దీనివలన ప్రయోజనమేమిటి?

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ దేవీ నవరాత్రులు కన్యాపూజలతో ముగుస్తాయి. శాస్త్రాలలో నవరాత్రుల వ్రతాలలో కన్యాపూజకు సంబంధించిన విధివిధానాలను తెలియజేశారు. కన్యాపూజను కుమారిపూజ అని కూడా అంటారు. దేవీభాగవతాన్ని అనుసరించి కన్యాపూజలతో దుర్గమ్మవారు ప్రసన్నమవుతారు. శాస్త్రాలను అనుసరించి రెండేళ్లు మొదలుకొని 10 ఏళ్ల వయసుగల బాలికలకు కన్యాపూజలు చేస్తుంటారు. ఈ కుమారి పూజలకు సంబంధించి శాస్త్రాలలో చెప్పిన విషయాలను, ఈ పూజల వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..




దేవీ భాగవతంలోని ప్రథమ ఖండంలోని తృతీయ స్కంధంలో రెండేళ్ల వయసుగల బాలికలను కుమారిగా పేర్కొన్నారు. ఈ వయసువారిని పూజించడం వలన శోకం, దరిద్రబాధలు తొలగిపోతాయని, బాలికల ఆయుష్షు వృద్ధి చెందుతుందని తెలిపారు. 

మూడేళ్ల వయసు గల బాలికలను త్రిమూర్తి అని అంటారు. ఈ వయసుగల బాలికలను పూజించడం వలన ధర్మం, అర్థం సిద్ధిస్తుంది. పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.

నాలుగేళ్ల వయసుగల బాలికలను కల్యాణి అని అంటారు. వీరిని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. విజయం ప్రాప్తిస్తుంది. 

ఐదేళ్ల బాలికలను కాళిక అని అంటారు. వీరిని పూజించడం వలన శత్రుబాధలు తొలగుతాయి.  

ఆరేళ్ల బాలికలను చండిక అని అంటారు. వీరిని పూజించడం వలన ఐశ్వర్యం సిద్దిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది.


ఏడేళ్ల బాలికలను శాంభవి అని అంటారు. వీరిని విధాన పూర్వకంగా పూజించడం వలన వివాదాలు సమసిపోయి, ప్రశాంతత చేకూరుతుంది.

ఎనిమిదేళ్ల బాలికలను దుర్గా స్వరూపంగా భావిస్తారు. ఈ వయసువారిని పూజించడం వలన పరలోకంలో ఉత్తమగతులు కలుగుతాయి. పనులలో విజయం చేకూరుతుంది. 

తొమ్మిదేళ్ల బాలికలను  సుభద్ర అని అంటారు. వీరిని పూజించడం వలన దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. 

పదేళ్లు గల బాలికలను రోహిణి అని పేర్కొంటారు. వీరిని పూజించడం వలన మనసులోని అన్ని కోరికలు నెరవేరుతాయి. 



Updated Date - 2021-10-13T17:21:53+05:30 IST