kanpur violence: ప్రధాన నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-06-05T00:41:04+05:30 IST

కాన్పూర్‌ సిటీలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ప్రధాన నిందితుడు హయత్ జఫర్ హస్మిని శనివారంనాడు లక్నోలో పోలీసులు ..

kanpur violence: ప్రధాన నిందితుడి అరెస్టు

లక్నో: కాన్పూర్‌ సిటీలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ప్రధాన నిందితుడు హయత్ జఫర్ హస్మిని శనివారంనాడు లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు.  శుక్రవారం చెల్లరేగిన అల్లర్లు, హింసాకాండలో 40 మంది వరకూ గాయపడ్డారు. అల్లర్లను ప్రోత్సహించి, హింసకు దిగిన సుమారు 500 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. శనివారం 18 మందిని అరెస్టు చేసి, పలువురుని ప్రశ్నించారు. పరేడ్, నాయి సండక్, యతీమ్‌ఖానా ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొంత మంది నిరసనలకు దిగారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధి ఒకరు అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకారులు బలవంతంగా దుకాణాలను మూయించే ప్రయత్నం చేశారు. దీనిని మరో వర్గం వారు వ్యతిరేకించడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన పోలీసులపై కూడా అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు.


కాగా, అల్లర్ల ఘటనలపై ఇన్‌స్పెక్టర్ బెకాన్‌గంజ్ నవాబ్ అహ్మద్ తరఫున తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో హయత్ జఫర్ హస్మి సహా 36 మంది పేర్లు చేర్చారు. బాబా క్రాస్‌రోడ్స్‌లోని మార్కెట్ ఏరియా మూసివేయడం, ఆ వెంటనే రాళ్లు రువ్వుడానికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. చందేశ్వర్ హటా వద్ద రోడ్లపై వెళ్తున్న సామాన్య ప్రజలపై అల్లరిమూక దాడి చేయడానికి సంబంధించి రెండవ ఎఫ్ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. సబ్ ఇన్‌ ఇన్‌స్పెక్టర్ అరిఫ్ రజా తరఫున మూడో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో హయత్ జఫ్రా హస్మితో పాటు 19 మంది పేర్లు చేర్చారు. మరో 350 మందిని గుర్తించి కేసులు పెట్టారు.


కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లోని దెహత్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజునే కాన్పూర్ సిటీలో హింసాకాండ చోటుచేసుకోవడం సంచలనమైంది. ఒక వర్గం వారు దుకాణాలను మూసివేసేందుకు ప్రయత్నించడంతో హింస చెలరేగగా, బాంబులు విసురుకోవడం, గన్‌షాట్స్ పేల్చడం వంటివి చోటుచేసుకున్నాయి. అల్లర్ల నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలు శనివారంనాడు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.

Updated Date - 2022-06-05T00:41:04+05:30 IST