నిర్వాసితుల కన్నెర్ర

ABN , First Publish Date - 2022-08-20T09:33:18+05:30 IST

నచ్చజెప్పేందుకు వచ్చిన ఉన్నతాధికారుల నిలదీత.. పెద్దఎత్తున పోలీసుల మోహరింపు..

నిర్వాసితుల కన్నెర్ర

డిండి ఎత్తిపోతల జలాశయాల బాధితుల ఆందోళన తీవ్రం

మర్రిగూడలో నాలుగో రోజూ దీక్ష

8 గంటలపాటు చౌరస్తా దిగ్బంధం

ఏడు గంటలకు పైగా విద్యుత్తు స్తంభంపై కూర్చుని నిరసన

పరామర్శకు వచ్చిన ఆర్డీవోను శిబిరంలో కూర్చోబెట్టిన వైనం


మర్రిగూడ, ఆగస్టు 19: నచ్చజెప్పేందుకు వచ్చిన ఉన్నతాధికారుల నిలదీత.. పెద్దఎత్తున పోలీసుల మోహరింపు.. విద్యుత్తు స్తంభం ఎక్కిన యువకులు.. రోజంతా చౌరస్తా దిగ్బంధం.. ఆర్డీవోను అడ్డుకుని ఏకంగా ఆమరణ దీక్షా శిబిరంలోనే కూర్చోబెట్టి డిమాండ్లపై హామీకి పట్టు..! శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడలో.. డిండి ఎత్తిపోతల పథకంలో చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల నిర్మాణంతో భూమి, ఇళ్లు కోల్పోతున్నవారి ఆందోళన సాగిన తీరిది. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌ జలాశయం నిర్వాసితులకు అందజేసిన తరహాలోనే తమకూ పునరావాసం, పరిహారం ఇవ్వాలని చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల భూ నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఇందుకోసం మర్రిగూడ మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం నాలుగో రోజు వీరి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. దీక్షలో ఉన్న వారిని పరామర్శించేందుకు ఉదయం 7 గంటల ప్రాంతంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీవో గోపీరాం వచ్చారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని, దీక్ష విరమించాలని కోరారు. ఆరోగ్యం క్షీణిస్తుందని నచ్చజెప్పే ప్రయత్నంచేసినా నిర్వాసితులు ససేమిరా అన్నారు. ‘సర్వం కోల్పోయాం, మాకు ఆధారం లేదు, ఏడున్నరేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు, ఏ విధంగా దీక్ష విరమించాలి’ అంటూ అదనపు కలెక్టర్‌ను ప్రశ్నించారు. మీరు ప్రభుత్వం తరుపున వచ్చారా? మా సమస్యలు పరిష్కరించడానికి వచ్చారా? అంటూ నిలదీశారు. దీంతో అదనపు కలెక్టర్‌, ఆర్డీవో వెళ్లిపోయారు. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉదయం 10 గంటలకు భూ నిర్వాసితులు, రైతులు మర్రిగూడలోని చౌరస్తాను దిగ్బంధించారు. రాత్రి 7 గంటల దాకా ఇది కొనసాగింది. కాగా, ఆర్డీవో గోపీరాం.. మధ్యాహ్నం మళ్లీ వచ్చారు. ఇక చౌరస్తా దిగ్బంధం కొనసాగుతుండగానే నిర్వాసితుల్లో ఆరుగురు యువకులు 133 కేవీ విద్యుత్‌ స్తంభం ఎక్కారు. దిగి రావాలని ఆర్డీవో, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ విఠల్‌రెడ్డి విజ్ఞప్తి చేసినా వినలేదు. వారితో ఆర్డీవో ఫోన్‌లో మాట్లాడినా కచ్చితమైన హామీ కోసం పట్టుబట్టారు. కలెక్టర్‌ వస్తున్నారని, ఆయనతో చర్చించేందుకు రావాలని ఆర్డీవో చెప్పగా సాయంత్రం 6.30 ప్రాంతంలో కిందికి దిగారు. కాగా, దీనికిముందు మధ్యాహ్నం 2 గంటల వేళ ఆర్డీవో హామీ ఇవ్వకుండా వెళ్లిపోతుండగా నిర్వాసితులు అడ్డుకున్నారు. పోలీసులు వారించినా వినకుండా ఆర్డీవోను తమతో పాటు శిబిరంలో కూర్చోబెట్టుకున్నారు.


ఉన్నతాధికారులు వచ్చేవరకు అధికారిని పంపించేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి శిబిరం నుంచి పక్కకు వచ్చిన ఆర్డీవో.. రాత్రి 8 ప్రాంతంలో  బైక్‌పై వెళ్లిపోయారు. నిర్వాసితులు పట్టువీడకపోవడంతో 150 మందిపైగా పోలీసులను మోహరించారు. కాగా, నిర్వాసితుల ఆరోగ్యం క్షీణిస్తోంది. వారి దీక్షను పోలీసులు భగ్నం చేసి భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. అయితే, దీనిని ప్రతిఘటించేందుకు దీక్షలో లేని నిర్వాసితులు శిబిరం వద్ద శుక్రవారం రాత్రి బస చేశారు.

Updated Date - 2022-08-20T09:33:18+05:30 IST