కన్న బిడ్డను కోల్పోయి.. కన్నీటిని దిగమింగుతూ...

ABN , First Publish Date - 2022-05-02T05:58:53+05:30 IST

గత నెల 26వ తేదీ మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే.

కన్న బిడ్డను కోల్పోయి.. కన్నీటిని దిగమింగుతూ...
బిడ్డ ఫొటోతో కన్నీటి మధ్య కాలం గడుపుతున్న నరసింహులు, రమణమ్మ దంపతులు

తోటమాలి నరసింహులు దీనగాథ


ఆ ఇంటికి తలుపు లేదు.. గోడలకు పూతలు కూడా లేవు. ఆ ఇంటిని కూడా ఈ మధ్యనే కట్టించుకున్నారు. ఇంటి ముంగిట ఓ కట్టెల పందిరి ఎండిపోయి ఉంది. ఆ దంపతులు ఇంటి వద్ద ఉండటం లేదు. కారణం.. బిడ్డ అటూ ఇటూ తమ కళ్లెదుటే తిరుగుతున్నాడన్న భ్రమ వారిని వెంటాడుతోంది. బిడ్డ ఆనవాళ్లు కళ్లెదుటే కనిపిస్తూ ఉండటంతో వారు అక్కడ ఉండలేక ఏదో తోటకనో.. అక్కడికనో ఇక్కడికనో.... మిగిలిన ఇద్దరు బిడ్డలను చంకనేసుకొని వెళ్లిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వీరిని ఆంధ్రజ్యోతి కదిలిస్తే... మా బిడ్డ జాషువా..... అంటూ కన్నీరు పెడుతున్నారు తప్ప వారి నోటి నుంచి ఒక్క మాట రావడం లేదు. తిరుపతి రుయా వద్ద చిన్నారి మృతదేహంతో బైక్‌లో వచ్చిన నరసింహులు దీనగాథ ఇది. 


రాజంపేట, మే 1 : ఏదైనా అనుకోని సంఘటన క్షణాల్లో గతినే మార్చి వేస్తుంది. ఏమి జరుగుతుందో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అనేక ఏళ్లుగా మన రాష్ట్రంలో అంబులెన్స్‌ మాఫియా చేస్తున్న ఆటలను కట్టేసిన సంఘటన ఇంకా కళ్ల ముందే కనబడుతోంది. ఒక్క సంఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని గజగజలాడించింది. ఒక సామాన్యుడు తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర అంబులెన్స్‌ మాఫియా స్థితినే మార్చి వేసింది. ఆ తోటమాలి కన్నీటిగాథ మాత్రం అందరినీ కంట తడి పెట్టిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చూపు పెట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 

గత నెల 26వ తేదీ మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. కడప-నెల్లూరు సరిహద్దు అడవుల్లో చిట్వేలి, రైల్వేకోడూరు రహదారికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ కుగ్రామం ఉంది. అక్కడికి వెళ్లడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటి కుగ్రామంలో తోటమాలి నరసింహులు, రమణమ్మల దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో పెద్ద కుమారుడు పదేళ్లు కూడా పూర్తి కాని జాషువా. ఈ బిడ్డలే వారికి సర్వస్వం. వారి ఆస్తిపాస్తులు ఈ బిడ్డలే.. వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. గ్రామానికి సమీపంలో మామిడి తోట కాపలా దారుడు (తోటమాలి) గా ఉంటూ రోజూ కూలీనాలీ చేసుకుంటూ జీవించే పేద కుటుంబం. కన్న బిడ్డలే సర్వస్వం అనుకుని జీవించే ఆ పేద కుటుంబం ఆనందాన్ని ఎందుకో దేవుడు చూడలేకపోయాడు. ఏదైతేనేం.. తొలి బిడ్డ జాషువాకు ఏదో ఒకటి రెండుసార్లు తప్ప ఎటువంటి అనారోగ్యం లేదు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతుండేవాడు. ఇంతలో వారం రోజుల కిందట అనారోగ్యానికి గురి కావడం, వెంటనే తిరుపతికి తీసుకెళ్లడం, రుయా ఆసుపత్రిలో ఒక రోజులోనే చనిపోవడం చకచకా జరిగిపోయింది. బిడ్డ శవాన్ని తీసుకురావడానికి ఆ పేద తండ్రి పడ్డ బాధ వర్ణణాతీతం. ఆ సమయంలో కనీసం శవాన్ని కూడా మా అనుమతి లేనిదే తీసుకెళ్లడానికి లేదూ... మాకు 20 వేలు ఇస్తే శవాన్ని తెస్తామని రుయా ఆసుపత్రి అంబులెన్స్‌ రౌడీల వ్యవహారం చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ క్షణంలో ఏమాత్రం లెక్క చేయకుండా పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పేద తండ్రి తన అన్న కుమారుడి సహాయంతో మోటారు సైకిల్‌పైనే తన బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకురావడానికి ఏమాత్రం సంకోచించలేదు. కన్న బిడ్డను తీసుకురావడానికి అతను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం నేడు రాష్ట్రాన్ని మార్చి వేసింది. క్షణాల్లో ప్రభుత్వం కదిలింది. రాష్ట్రంలోని అంబులెన్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. అనేక మందిపై కేసులు నమోదు చేసింది. ఫలానా చోటికి వెళ్లాలంటే నిబంధనలను కఠిన తరం చేసింది. ప్రైవేటు అంబులెన్స్‌ల్లో వెళ్లడానికి కూడా పేదోడికి అనుగుణంగా చార్జీలు విధించింది. దీనంతటికి కారణం ఆ పేద తండ్రి కన్న కొడుకుని తీసుకురావడంలో చూపిన సాహసోపేతమైన నిర్ణయం. అంతవరకు బాగుంది. అయితే ఆ నరసింహులు కుటుంబం ఆలనా పాలనా గురించి పట్టించుకునేవారు లేరు. 


కన్న బిడ్డే కదలాడుతున్నట్లు...

బిడ్డ చనిపోయి వారం రోజులు కూడా కాలేదు. క్షణంలో బిడ్డ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణణాతీతం. బిడ్డ అటూ ఇటూ తమ కళ్లెదుటే తిరుగుతున్నాడన్న భ్రమ వారిని వెంటాడుతోంది. బిడ్డ ఆనవాళ్లే కళ్లెదుటే కనిపిస్తూ ఉండటంతో వారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు తోట యజమాని శ్రీకాంత్‌ అంబులెన్స్‌ను పంపి దహనక్రియలకు సహాయపడ్డాడు. జనసేన నాయకులు తమ శక్తి మేరకు ఆర్థికసాయం చేశారు తప్ప ఒక్కరంటే ఒక్కరూ ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు. ఏ అధికారి కూడా అటు వైపు వెళ్లలేదు. వారికి కాసింత సాయం చేసిన పాపాన పోలేదు. అంటే... దీనికి ఏమని సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



Updated Date - 2022-05-02T05:58:53+05:30 IST