కన్నతల్లికి తిండిపెట్టని కొడుకులు

ABN , First Publish Date - 2020-09-22T06:26:13+05:30 IST

వయసు మీద పడి.. ఆకలితో అలమటిస్తున్న వృద్ధురాలికి కన్నకొడుకులు, బిడ్డలు కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో ఆమె

కన్నతల్లికి తిండిపెట్టని కొడుకులు

ఎస్పారెస్పీ కాల్వలో దూకేందుకు యత్నించిన వృద్ధురాలు

సకాలంలో రక్షించి మనవడికి అప్పగించిన హన్మకొండ పోలీసులు


వరంగల్‌ అర్బన్‌ క్రైం, సెప్టెంబరు 16: వయసు మీద పడి.. ఆకలితో అలమటిస్తున్న వృద్ధురాలికి కన్నకొడుకులు, బిడ్డలు కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో ఆమె విసిగిపోయి చివరకు ఆత్మహత్యకు యత్నించింది. పెద్దమ్మగడ్డ సమీపంలో కాల్వలో దూకే క్రమంలో కెనాల్‌ రెయిలింగ్స్‌ మధ్య చిక్కుకోగా పోలీసులు సకాలంలో వచ్చి ఆమెను రక్షించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు వివరాల ప్రకారం.. పైడిపెల్లికి చెందిన ఇట్యాల ఉప్పమ్మ(75) భర్త వీరయ్య చాలా ఏళ్ల క్రితం మృతిచెందడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు వీరయ్య, బుచ్చెల్లయ్యతో పాటు కుమార్తెలు సమ్మక్క, సరోజన ఉన్నారు. కొద్దిరోజుల పాటు వంతుల వారీగా ఉప్పమ్మను పోషించారు. కొన్నాళ్లుగా కొడుకులు, బిడ్డలు వృద్ధురాలిని పోషించడం లేదు. తింటిపెట్టమని చెప్పి కన్నీళ్లపర్యంతమైనా ఆ ఇద్దరు కొడుకులు పట్టించుకోలేదు.


దీంతో ఉప్పమ్మ బుధవారం ఉదయం పైడిపెల్లి నుంచి పెద్దమ్మగడ్డ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ వద్దకు వచ్చింది. అక్కడివారితో తన కుమారులు తిండిపెట్టడం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కెనాల్‌ బ్రిడ్జి రెయిలింగ్‌ మధ్యలో నుంచి నీళ్లలోకి దూకే యత్నించింది. ఈక్రమంలో రెయిలింగ్‌ మధ్యలో చిక్కుని విలవిలలాడింది. అటుగా వెళ్లేవారు గమనించి 100డయల్‌కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై నవీన్‌కుమార్‌ ఆదేశాల మేరకు బ్లూకోల్ట్‌ సిబ్బంది నన్నెబోయిన రవీందర్‌, దేవేందర్‌ వచ్చి వృద్ధురాలిని బయటకు తీశారు. బ్లూకోల్ట్‌ సిబ్బంది ఉప్పమ్మను ఆమె మనవడు ఇట్యాల సతీష్‌కు అప్పగించారు. పోలీసు సిబ్బందిని హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీఐ దయాకర్‌, ఎస్సై కొంరెల్లి, నవీన్‌కుమార్‌, రవీందర్‌ అభినందించారు. 

Updated Date - 2020-09-22T06:26:13+05:30 IST