నిరాడంబరంగా కాణిపాక బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-08-09T14:07:00+05:30 IST

కరోనా నేపథ్యంలో కాణిపాక వరసిద్ధుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా..

నిరాడంబరంగా కాణిపాక బ్రహ్మోత్సవాలు

గ్రామోత్సవాలు రద్దు.. ప్రాకారోత్సవంతో సరి

పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి

కలెక్టర్‌ భరత్‌గుప్తా


ఐరాల(కాణిపాకం)(చిత్తూరు): కరోనా నేపథ్యంలో కాణిపాక వరసిద్ధుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలియజేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించే గ్రామోత్సవాలను ఈ ఏడాది రద్దుచేస్తున్నట్లు వెల్లడించారు. కాణిపాక ఆలయ వార్షిక బ్రహ్సోత్సవాల నిర్వహణపై శనివారం కాణిపాకంలోని సమావేశ మందిరంలో ఆలయ అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 రోజుల పాటు స్వామి ఉత్సవర్లకు ప్రధాన ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ ఉత్సవానికి 50 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆలయంలో ఉత్సవాలు ఈ నెల 22న వినాయక చవితితో ప్రారంభమై సెప్టెంబరు 11న ముగుస్తాయన్నారు.


ఈ వేడుకలకు ప్రతి రోజూ 3 నుంచి 4 వేల మంది భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై సహకరించాలన్నారు. వాహన సేవను నిర్వహించే ఉభయదారులు స్వామికి నిర్వహించే అభిషేకానికి 20మంది మాత్రం హాజరు కావాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు పది సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు హాజరు కారాదని తెలియజేశారు. ఆలయంలో పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన అర్చక, పండితులకు నాలుగు రోజుల ముందు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా స్థానికంగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి సైతం కరోనా పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. చిత్తూరు, తిరుపతి బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దర్శన టికెట్లు అందిస్తామని పేర్కొన్నారు. ఏటా రూ.కోటికి పైగా ఖర్చయ్యే ఉత్సవాలకు ఈ ఏడాది రూ.12 లక్షలతో నిర్వహిస్తామన్నారు.


ఆలయ ఆదాయం తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఆలయాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుం టామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. ఈవో వెంకటేశు మాట్లాడుతూ వినాయక చవితి రోజున భక్తులకు ఉదయం 5  నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. రథోత్సవం, పుష్పపల్లకి, తెప్పోత్సవాన్ని సైతం ఆలయంలోపలే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు తప్పని సరిగా మాస్కు ధరించి శానిటైజేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ వెంకటనారాయణ, తహసీల్దార్‌ కేఏ.మధుసూదన్‌, ఎంపీడీవో నిర్మలాదేవి, ఏసీ కస్తూరి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 


22 నుంచి సెప్టెంబరు 11 వరకు బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలు ఈనెల 22న వినాయక చవితితో ప్రారంభం కానున్నాయి. 23న ధ్వజారోహణం, 24న మయూర వాహనం, 25న మూషిక వాహనం, 26న చిన్న,పెద్ద శేషవాహనం, 27న వృషభ వాహనం, 28న గజవాహనం, 29న రథోత్సవం, 30న తిరుకల్యాణం, అశ్వవాహనం, 31న వసంతోత్సవం, ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవ నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా సెప్టెంబరు 1న అధికార నంది వాహనం, 2న రావణ బ్రహ్మవాహనం, 3న యాళి వాహనం, 4న విమానోత్సవం, 5న పుష్పపల్లకి సేవ, 6న సూర్యప్రభ, 7న చంద్రప్రభ, 9న కల్పవృక్ష వాహనం, 10న పూలంగి సేవ, 11న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సోవాలు ముగుస్తాయి. 

Updated Date - 2020-08-09T14:07:00+05:30 IST