కాణిపాక ఆలయ రథ పాత చక్రాల దగ్ధం

ABN , First Publish Date - 2022-01-28T06:33:43+05:30 IST

చిత్తూరు జిల్లాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దివ్య రథం పాత చక్రాలను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి తగులబెట్టారు.

కాణిపాక ఆలయ రథ పాత చక్రాల దగ్ధం
కాలిపోయిన పాత రథ చక్రాలు

రాత్రి పూట తగులబెట్టిన దుండగులు


ఐరాల(కాణిపాకం), జనవరి 27: చిత్తూరు జిల్లాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దివ్య రథం పాత చక్రాలను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి తగులబెట్టారు.దాదాపు80యేళ్ల క్రితం తయారు చేయించిన వరసిద్ధుడి రథ చక్రాలను 2017లో తొలగించి కొత్తవి అమర్చారు.తొలగించిన చక్రాలను పాత సామాన్లు పెట్టే ప్రాంతంలో భద్రపరిచారు.అయితే భద్రపరిచిన ప్రాంతంలో కాకుండా  సమీపంలో రథ చక్రాలు కాలిబూడిదయ్యాయి.ఈవో కార్యాలయానికి, ఇంటికి అతి సమీపంలో రథ చక్రాలు దగ్ధమవడాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెవడంతో అధికారులు పరుగులు తీసి మంటలను ఆర్పారు. ఆలయానికి కూత వేటు దూరంలో రథ చక్రాలు దగ్ధం కావడంతో భద్రతా ఏర్పాట్లపై భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవో రేణుక, తహసీల్దార్‌ బెన్నురాజ సంఘటనా స్థలానికి విచ్చేసి వివరాలను తెలుసుకున్నారు. నివేదికలను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు తెలియజేశారు. ఆలయ ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిఘాను పెంచుతామని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌బాబు, ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.పాత చక్రాలు కాలి పోయాయే తప్ప ఎలాంటి ఆస్తి నష్టం వాటిల్లలేదని వివరించారు.సత్యప్రమాణాలకు నిలయమైన కాణిపాకంలో అపచారం జరిగిందన్న టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరిప్రసాద్‌  ఆలయ ఈవో నివాసానికి కూతవేటు దూరంలో రథ చక్రాలు తగలబడి పోవడం సిగ్గుచేటన్నారు. రథ చక్రాలను తగలబెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు డిమాండ్‌ చేశారు.పాత రథ చక్రాలను బహిరంగ ప్రదేశంలో ఉంచడమే తప్పన్నారు. 

Updated Date - 2022-01-28T06:33:43+05:30 IST