తమిళనాడును ఎవరూ విడగొట్టలేరు: కనిమొళి

ABN , First Publish Date - 2021-07-12T22:28:49+05:30 IST

తమిళనాడు రాష్ట్రాన్ని ఏ ఒక్కరూ విడగొట్టలేరని డీఎంకే నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి..

తమిళనాడును ఎవరూ విడగొట్టలేరు: కనిమొళి

చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని ఏ ఒక్కరూ విడగొట్టలేరని డీఎంకే నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనే లేదని  భరోసా ఇచ్చారు. తమిళనాడు ఇప్పుడు సురక్షితమైన ప్రభుత్వం హయాంలో ఉందని అన్నారు. తమిళనాడును విడిగొట్టి 'కొంగు నాడు' పేరుతో  కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం వ్యూహరచన చేస్తున్నట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కనిమొళి తాజా వ్యాఖ్యలు చేశారు.



తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి సైతం ఈ ఊహాగానాలను తిప్పికొట్టారు. బీజేపీ విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని అన్నారు. ''కొంగు నాడు పేరుతో రాష్ట్రం రూపుదిద్దుకునే అవకాశమే లేదు. ఇది ఒక ఊహ మాత్రమే. కొంగు నాడుతో ఆగిపోతారా? మరిన్ని నాడులు (ప్రాంతాలు) రూపుదిద్దుకుంటాయి. బీజేపీ విభజన రాజకీయాలను తమిళనాడు ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోరు. రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అవకాశమే లేదు. ఇతర రాష్ట్రాల విషయంలో అలాటిది జరిగి ఉండవచ్చు. ఇక్కడ అలాంటి అవసరమే లేదు'' అని అళగిరి పేర్కొన్నారు. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం దొడ్డిదారిలో తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రమాదకరమైన ఆలోచన వల్ల ఆ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని సీపీఎం నేత జి.బాలకృష్ణన్ హెచ్చరించారు.


కొత్త క్యాబినెట్ మంత్రుల ప్రొఫైల్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ, క్యాబినెట్‌లోకి కొత్తగా తీసుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్.మురుగన్‌ను కొంగునాడు, తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పేర్కొంది. దీంతో తమిళనాడును విడగొట్టి 'కొంగు నాడు' పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉందనే ఊహాగానాలు చెలరేగాయి.

Updated Date - 2021-07-12T22:28:49+05:30 IST