‘‘ ‘కని.. ఏదో ఉంటది నీ కవిత్వంల.. లోతుగ వెదికి పట్టుకోవాలె’ అనేవాడు’’

ABN , First Publish Date - 2020-10-05T07:48:30+05:30 IST

కాగితాల్లో ఏదేదో రాసి ఎవరో వాటిని ఆచరిస్తారని తాను మాత్రం ఇంట్లో పడుకునే రచయితలతో సమాజానికి ఏ ఉపయోగమూ ఉండదు...

‘‘ ‘కని.. ఏదో ఉంటది నీ కవిత్వంల..   లోతుగ వెదికి పట్టుకోవాలె’ అనేవాడు’’

పలకరింపు : రామాచంద్రమౌళి


కాగితాల్లో ఏదేదో రాసి ఎవరో వాటిని ఆచరిస్తారని తాను మాత్రం ఇంట్లో పడుకునే రచయితలతో సమాజానికి ఏ ఉపయోగమూ ఉండదు. 


మీకు ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం రావటం పట్ల స్పందన? 

ప్రజాకవి, అచ్చమైన మహామానవుడు, వేమనతో సమంగా ఈ సాధారణ మానవులనూ, మానవ సమాజాన్నీ స్వచ్ఛంగా ప్రేమించిన మనీషి కాళోజీ పేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టించిన అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని (రూ 101116/-) అత్యంత గౌరవంతో స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖరరావు అందజేయడం ఒక మహదానందకర సందర్భం. ఎన్నో పురస్కా రాలు అందుకున్న నాకు గత 30 ఏళ్లుగా చిరపరిచితుడైన అక్షరయోధుడు, మా మహానగరం వరంగల్లుకే చెందిన, మానవ రూపంలో మాతోపాటు జీవించిన ఋషి, ‘మా’ కాళోజీ పేర ప్రతిష్టితమైన గొప్ప పురస్కారం లభించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అనుభూతే ఒక పులకింత. 


కాళోజీతో మీకున్న అనుబంధం ఎటువంటిది? 

గత 30 సంవత్సరాలకన్నా ముందునుండే ఆయన నాకు బాగా పరిచయం. ఆయన నిజాంకాలంలో రజాకార్లతో తలపడి వరంగల్లులో ఉద్యమకారుడు బత్తిని మొగిలయ్య రజాకార్లచేత హత్య చేయబడ్డ నాటికి కాళోజీ అప్పటి ‘ఆర్యసమాజం’ లో చురుకైన పాత్ర వహిస్తున్నాడు. మా మామగారైన కీ.శే. చింతకింది పాప వినాశ్‌ ఆర్య అప్పుడు ఆర్యసమాజంలో ఒక ప్రసిద్ధ నాయకుడు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో అప్పుడప్పుడు కాళోజీగారిని కలిసేవాణ్ణి. నా పెళ్లికి కూడా కాళోజీ గారు వచ్చి ఆశీర్వదించడం నాకు జ్ఞాపకమే. ఆయన ఎంతో గౌరవించే వారి గురువు శ్రీ గార్లపాటి రాఘవరెడ్డిగారు వరంగల్లులోని మహబూబియా ఉన్నత పాఠశాలలో నాకు కూడా గురువు కావడం యాదృచ్ఛికమే ఐనా అది ఒక ఆనందకర ఘటనే. వరంగల్లు నగరానికి చెందిన ప్రసిద్ధ కమ్యూనిస్ట్‌ రచయిత, మేధావి శ్రీ పాములపర్తి సదాశివరావు గారి దగ్గర కూడా అనేకసార్లు వారితో సాంగత్యం ఉంది నాకు. కాళోజీ ‘లోగిలి’లో గత అనేక దశాబ్దాలుగా నిర్వహించబడ్తున్న ‘మిత్రమండలి’ ద్వారా కూడా సాహిత్య సంబంధం ఉంది. 


కాళోజీ సాధారణంగా ఎవరినీ మెచ్చుకోడని అంటారు. మీరెప్పుడైనా ఆయన మెప్పునుగాని, తిరస్కారాన్ని గానీ పొందారా? 

కాళోజీ సాధారణంగా ఎవరినీ మెచ్చుకోడని అనడం పూర్తిగా తప్పు. అతనిది పసిహృదయం. ప్రజాసంబంధమైన అంశాలపైన ప్రయోజనాత్మకతను నింపుకున్న కవితలను అతిసరళమైన ప్రజల పలుకుబడుల భాషలో ఎవరు రాసినా ఆయన తప్పక ప్రేమపూర్వకంగా ప్రశంసించేవాడు. ‘మిత్రమండలి’లో పాల్గొన్న రచయితల, కవుల రచనలను ఓపిగ్గా విని చాలా నిర్మొహమాటంగా తప్పొప్పులను విడమర్చి చెప్పి మార్గదర్శనం చేసేవాడు. కొన్నిసార్లు నా కవిత్వాన్ని వినిపిస్తే సర్రియలిస్టిక్‌ ధోరణిలో, నైరూప్య, మార్మిక పద్ధతిలో ఒక వైవిధ్యతకోసం ప్రాకులాడే నాకు ‘గింత సంక్లిష్ట కవిత్వం ఎందుకురా.. ఎవనికర్థమైతది ఇది. ఒట్టి సాధారణమైన మనిషికి కూడా అర్థమయ్యేటట్టుంటే అది అందరికి సమజైతది. కని.. ఏదో ఉంటది నీ కవిత్వంల.. లోతుగ వెదికి పట్టుకోవాలె’ అనేవాడు. శైలీ, రూపం, అలంకారాలు, ఆర్భాటాలు పేరుతో కవితను ప్రజలనుండి దూరం చేయడం అతనికి నచ్చదు. ముఖం మీద గుద్దినట్టు ధిక్కార స్వరంతో ఆగ్రహించడమే అతని నైజం. 


వరంగల్‌ నుండి ఎక్కువ లెఫ్ట్‌ సాహిత్యమే వచ్చింది కదా. ఆ ప్రభావంలో పడ కుండా భిన్నమైన, మీదైన పాయలో రాశారు. ఎలా సాధ్యమైంది?

సాహిత్యపరంగా వరంగల్లుది ఒక విశిష్ట మైన చరిత్ర. ఆదికవి పాల్కురికి సోమనా థుడు, మహాకవి బమ్మెర పోతన, కాకతీయుల కాలంనాటి ‘నృత్తరత్నావళి’ని అందించిన జాయపసేనాని వంటి ప్రాచీనులను ప్రక్కన పెడితే ఆధునికుల్లో మీరన్నట్టు లెఫ్ట్‌ భావజాలంతో జీవితాంతం తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ విస్తృతమైన సాహిత్యాన్ని సృజిస్తూ ‘సృజన’ పత్రికను విప్లవోద్యమ జ్వాలాకేతనంగా ఎగరేస్తూ నడుస్తున్న అక్షరయోధుడు వరవరరావు, అత్యాధునిక అభ్యుదయ భావజాలంతో చైతన్యాన్ని రగులుస్తున్న ఆచార్య కాత్యాయనీ విద్మహే, దిగంబర కవుల కాలంనాటి ఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ ఆవిర్భవించిన చేతనా వర్తం కవులు వే.నరసింహారెడ్ది, కోవెల సంపత్కుమార, ఆచార్య పేర్వారం జగ న్నాథం, ఆచార్య కోవెల సుప్రసన్న, తెలుగునాట నవలా రచనా పాటవంతో విఖ్యాతుడైన అంపశయ్య నవీన్‌, విమర్శ రంగంలో వినుతికెక్కిన ఆచార్య బన్న అయిలయ్య, సింగరేణి కార్మికుల కష్టాలనూ, కన్నీళ్ళనూ అక్షరబద్దం చేసి విజ్ఞుల ప్రశంసలందుకున్న పి. చంద్‌.. తనదైన విశ్వకవితా ముద్రతో తాత్విక కవితలను సృజించే వి.ఆర్‌. విద్యార్థి.. విశ్వసాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తూ పోతన మహా భాగవతం, శంకరాచార్య ‘సౌందర్య లహరి’, మొత్తం గ్రీకు సాహిత్యం తదాది 170 గ్రంథాలను అందించిన డా. లంకా శివరామప్రసాద్‌, అనేక కవితా సంపుటాలను వెలువరించి తనదైన స్వరాన్ని వినిపించే పొట్లపల్లి శ్రీనివాసరావు, అనిశెట్టి రజిత, నెల్లుట్ల రమాదేవి.. ఇట్లా విభిన్న సాహిత్య ధోరణులతో రచనా నైపుణ్యాలతో విలసిల్లే కవులూ, రచయితలూ ఉన్న వరంగల్లు ఒక సాహిత్య సంగమం. సాహిత్య రాజధాని. ఒక్క ‘లెఫ్ట్‌’ భావజాలానికి మాత్రమే పుట్టిల్లు కాదు. 


రచయిత ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండాలంటారు కదా. మీరేమంటారు? 

ప్రతిపక్షం అంటే పాలకపక్షం నిజంగానే ఒక కుక్కను చూపించి దాన్ని ‘కుక్క’ అంటే మనం దాన్ని పిల్లి అనో నక్క అనో తప్పనిసరిగా అనాలన్న కుసంస్కార తత్వాన్ని కలిగి ఉండడం సరి కాదు. రచయిత ప్రజాపక్షం వహించి ప్రజోప యోగ పోరాటాల్లో పాలుపంచుకుని ఒక సాంస్కృతిక సేనానిగా వ్యవహరిం చాలి. నిజానికి మనదగ్గర కాల్పనిక, వుటోపియన్‌ సాహిత్యమే ఎక్కువగా వస్తోంది. సామాజికంగా జరుగుతున్న అనేకానేక దోపిడీలకు వ్యతిరేకంగా రచయితలు, కవులు రోడ్లెక్కి ప్రతిఘటిస్తూ జనాన్నీ సంఘటితపర్చి నాయకత్వం వహించిన సందర్భాలే లేవు. కాగితాల్లో ఏదేదో రాసి ఎవరో వాటిని ఆచరిస్తారని తాను మాత్రం ఇంట్లో పడుకునే రచయితలతో సమాజానికి ఏ ఉపయోగమూ ఉండదు. 

ఇంటర్వ్యూ : వెల్దండి శ్రీధర్

(రామా చంద్రమౌళి ‘కాళోజీ పురస్కారం-2020’ స్వీకరించిన సందర్భంగా)


Updated Date - 2020-10-05T07:48:30+05:30 IST