న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, గుజరాత్‌కు చెందిన రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ (ఆర్‌డీఏఎం) ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిలు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. కన్నయ్య కుమార్ రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నారని, త్వరలోనే పార్టీలో చేరనున్నారనీ కొద్దికాలంగా వినిపిస్తూనే ఉంది. రాహుల్ గాంధీ సైతం యువనేతలతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ టీమ్‌లో కన్నయ్య కుమార్, మేవాని కీలక పాత్ర పోషించనున్నారని అంచనా వేస్తున్నారు. కన్నయ్య కుమార్ బీహార్‌లో కీలకమైన యువనేత అని, జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చర్చించేందుకు కన్నయ్య కుమార్ ఇటీవల రాహుల్ గాంధీని సైతం కలుసుకున్నారు. ప్రస్తుతం కుమార్ సీపీఏ నేతగా ఉంటూ, ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
కాగా, గుజరాత్‌లోని వడ్గాం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మేవానీ, ఆర్‌డీఏఎం కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మేవానీపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.