ఆధ్యాత్మిక రాజధానిగా కన్హా శాంతివనం

ABN , First Publish Date - 2022-08-13T08:00:39+05:30 IST

ఆధ్యాత్మిక రాజధానిగా కన్హా శాంతివనం

ఆధ్యాత్మిక రాజధానిగా కన్హా శాంతివనం

ఆ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సర్కారు కృషి

శాంతి వనం సేవలు ప్రశంసనీయం

మహాత్ముడి విలువలే యువతకు ఆదర్శం

ఇంటర్నేషనల్‌ యూత్‌ సమ్మిట్‌లో కేటీఆర్‌ 


షాద్‌నగర్‌/హైదరాబాద్‌, ఆగస్టు, 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా కన్హా శాంతి వనాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో వివిధ దేశాలకు చెందిన 12వేల మంది యువతతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ యూత్‌ కైండ్‌నెస్‌ సమ్మిట్‌ను శుక్రవారం కేటీఆదర్‌ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత జనాభాలో సగానికి పైగా 27 ఏళ్ల లోపు యువత ఉందని, యువ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాల సందర్భంగా రాష్ట్రంలోని 552 సినిమా థియేటర్లలో 22 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన సినిమాను చూపిస్తున్నామని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి సూక్తిని ఆచరిస్తూ.. గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయిస్తోందని చెప్పారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 240కోట్ల మొక్కలు నాటామని, ఇందులో 85శాతం మొక్కలు సంరక్షించామని వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రం సాధించని అభివృద్ధి తెలంగాణ సాధించిందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో 16.4 లక్షల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. కొవిడ్‌ సమయంలో కన్హా శాంతి వనం చేసిన సేవా కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు. కన్హా శాంతివనం చేపడుతున్న ఎన్నో అద్భుత కార్యక్రమాల గురించి విన్నానని, ఈ కేంద్రం తెలంగాణలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్‌ కొనియాడారు. 

Updated Date - 2022-08-13T08:00:39+05:30 IST